ఎన్నికల తీరే మారిపోతోంది… డబ్బున్న వాడిదే రాజ్యం అన్నట్లు పొలిటికల్ సినేరియా తయారవుతోంది .. ఎలక్షన్స్‌లో నగదు ప్రవాహానికి బ్రేక్ వేయాల్సింది అధికారగణమే.. అయితే ఆ అధికారులే ఉద్యోగాలకు రిజైన్ చేసి ఎన్నికలబరిలోకి దిగడానికి రెడీ అయిపోతున్నారు.. పాలిటిక్స్ కాస్లీగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో బడాబాబులకు ధీటుగా మేము సైతం ఖర్చుపెట్టగలంమంటున్నారు సదరు ఉద్యోగులు.. వచ్చే ఎన్నికల ముఖ్యచిత్రంపై అలాంటి వారు పలువురు కనిపిస్తున్నారు .. అసలు వారికి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో ప్రభుత్వ సిబ్బంది హడావుడి కనిపించబోతోంది .. రానున్న ఎన్నికల్లో మాజీ ఐఆర్ఎస్లు, ఐపిఎస్‌లు పోటీకి సిద్దమవుతున్నారు.. వారితో పాటు సిఐ స్థాయి పోలీసు అధికారులు కూడా.. ఉద్యోగాలకు రిజైన్ చేసి మరీ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారు.. ఖర్చుకు వెనకాడే పరిస్థితి లేదని… ఎంతమొత్తమైనా ఇట్టే ఖర్చు పెట్టేస్తామని పార్టీలకు ఆఫర్లు ఇచ్చేస్తున్నారు సదరు మాజీ అధికారులు ..
తాజాగా రాయలసీమలో ఇద్దరు సిఐలు ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చి రాజకీయ రంగప్రవేశానికి సిద్దమయ్యారు .. అందులో ఒకాయన ప్రధాన పార్టీ తరపున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి బేరసారాలు పూర్తి చేసుకుంటున్నారంట .. ఒక సిఐగా పనిచేసిన ఉద్యోగి ఏకంగా ఎంపీ టికెట్ ఆశిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది జిల్లాలో.. సదరు మాజీ సిఐ 100 కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని .. తాను టికెట్ ఆశిస్తున్న పార్టీ అధినేతకు హామీ కూడా ఇచ్చారంట..
మరో మాజీ సిఐ అనంతపురం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తెగ తాపత్రయపడిపోతున్నారంట.. పాతిక కోట్ల రూపాయలు ఇట్టే ఖర్చుపెట్టేస్తానని ఆయన ఓపెన్‌గా ప్రకటిస్తుండటం చర్చనీయాంశంగా మారిందిప్పుడు.. ఇక ఐఆర్ఎస్, ఐఏఎస్ సర్వీసుల్లో పనిచేసిన కనీసం 10 మంది అధికారులు ప్రధాన పార్టీల్లో చేరి ప్రజాప్రతినిధులు అయిపోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు .. ముంబై, ఢిల్లీలల్లో పనిచేసిన ఈ బ్యూరోక్రాట్లు వందల కోట్లు వెనకేసుకున్నారంట..తమకు టికెట్ ఇస్తే పార్టీ ఫండ్‌గా 50 కోట్లు ఇస్తామని వారు ఆఫర్ చేస్తున్నారంట .. ఎంపి టికెట్ ఇస్తే తమ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యత తమదే అని భరోసా కూడా ఇస్తున్నారంట.. దాంతో ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వారికి అంత డబ్బు ఎక్కడిదా అని ఆయా పార్టీల నేతలే ముక్కుమీద వేలేసుకంటున్నారు..
రియల్ ఎస్టేట్, భూదందాలు, సెటిల్మెంట్లు, చేసే ప్రతిపనికీ కమీషన్లతో అలాంటి వారు అపర కుబేరులైపోయారన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు .. ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఏసిబి, సిబిఐ దాడులకు దొరక్కుండా సంపాదించిన ఆస్తులన్నీ బినామీల మీద పెట్టేస్తారు … ఇక ఇప్పుడు పొలిటికల్ స్కెచ్‌తో ఆ డంప్‌లు తెరుస్తూ డబ్బు వెదజల్లడానికి రెడీ అయిపోతున్నారు..
ప్రస్తుతం రాజకీయాలు ఎంత ఖరీదైపోయాయో… పంచాయతీ ఎన్నికల్లో కూడా పట్టుపడుతున్న కోట్లాది రూపాయలే నిరూపిస్తున్నాయి.. ఇక లోకసభ, అసెంబ్లీ ఎన్నికలంటే ఆ ఖర్చు ఏ రేంజ్లో ఉంటుందో చెప్పక్కర్లేదు.. అలాంటిది మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ట్రెడిషనల్ పొలిటీషియన్స్‌ని ఢీకొట్టడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నుంచి వచ్చిన వారు కాలుదువ్వుతున్నారంటే.. సర్వీసులో ఉన్నప్పుడు వారి అక్రమాల నిర్వాకాలు అర్థమవుతాయి… అంతేలేండి ఒక సాధారణ సిఐ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 100 కోట్లు ఖర్చుపెడతానంటున్నాడంటే .. ఇక చెప్పేదేముంది