Home News Politics

బ్లాక్ ఎఫెక్ట్ అంత పని చేసిందా…!

SHARE

ఏపీ టీడీపీలో నల్లచొక్కాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది… నల్ల చొక్కాలు ధరించారు.. నిరసన తెలిపారు.. అంతా అయిపోయినా.. ఇంకా దానికి సంబంధించిన చర్చే పార్టీ వర్గాల్లో జరుగుతోందంటే బ్లాక్ షర్ట్స్ ప్రభావం పార్టీ నేతలపై ఏ మేరకు పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎవరిదనే అంశం దగ్గర్నుంచి.. ఈ ఐడియాతో లాభపడిందెవరు..? భంగపడిదెవరు..? అనే అంశాల మీద పార్టీ వర్గాల్లో పెద్ద డిబేటే నడుస్తోంది…

ప్రత్యేక హోదాపై పూర్తి స్థాయిలో ఉద్యమించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది టీడీపీ అధినాయకత్వం… ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటో తేదీన జరిగిన బంద్‌కు సంఘీభావం ప్రకటిస్తూ నల్లచొక్కాలతో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపింది టీడీపీ… ఎన్నడూ లేని విధంగా.. ప్రతిపక్షంలో కూడా అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా.. చంద్రబాబు ఏనాడూ బ్లాక్ షర్ట్ వేసుకోలేదు. నల్ల బ్యాడ్జీలు ధరించడమో.. నల్ల రిబ్బన్లతో మౌన ప్రదర్శన లాంటింది చేశారే తప్ప.. పూర్తిగా నల్ల చొక్కా వేసుకుని నిరసన కార్యక్రమనేదే చేయలేదు…

చంద్రబాబు తొలిసారిగా తన రాజకీయ జీవితంలో తన వస్త్రధారణ మార్చారు… ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది… చంద్రబాబు లుక్ మార్చే ఐడియా ఇచ్చిందెవరనే చర్చ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా సాగడమే కాదు.. కూపీ లాగే ప్రయత్నమూ చేస్తున్నారు కొందరు నేతలు.. దాంతో అసలు విషయం బయటకు వచ్చిందంట..టీడీఎల్పీ భేటీలో కేంద్రం తీరు మీద నిరసన తెలపాలన్న చర్చ జరుగుతున్న క్రమంలో ముందుగా నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరు కావాలనే ప్రతిపాదన వచ్చిందట. అయితే ఆ కొద్దిసేపటికే నల్ల బ్యాడ్జీలు కాదు.. నల్ల చొక్కాలు వేసుకొద్దామంటూ స్వయంగా చంద్రబాబే ప్రకటించారట. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. లోకేష్‌ ప్రతిపాదన మేరకే చంద్రబాబు నల్లచొక్కాల నిరసన ఐడియా ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చిందట.

అయితే కొందరి నేతల్లో ఆ స్థాయి సీరియస్‌నెస్ లేదని చంద్రబాబు భావిస్తున్నారంట… అందుకే బ్లాక్ షర్ట్స్‌ వేసుకు రాని నేతలపై చంద్రబాబు ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆ ఫైర్ అవ్వడం కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా.. అందరి ముందు విరుచుకుపడడంతో సీనియర్ నేతలు సైతం బిత్తరపోయారట..ఉదయాన్నే అసెంబ్లీకి వెళ్లే ముందు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చంద్రబాబును కలవడానికి నివాసానికి వెళ్లారు. చంద్రబాబు సదురు ఎమ్మెల్యేను చూసీ చూడగానే ఉగ్ర రూపం దాల్చారట. అసలు చంద్రబాబు తనపై ఎందుకు సీరియస్‌ అయ్యారోననే విషయం వెంకటగిరి ఎమ్మెల్యేకు కాసేపటికి కానీ అర్థం కాలేదట. తెల్ల చొక్కాతో రావడం వల్లే తాను చంద్రబాబు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందని గుర్తించారట ఎమ్మెల్యే రామకృష్ణ. ఇదే ఊపులో చంద్రబాబు మరో సీరియస్ కామెంట్ కూడా చేశారట… ఇదే విధంగా ఉంటూ క్రమశిక్షణ పాటించకుండా ఉంటే టిక్కెట్ కూడా ఉండదంటూ హెచ్చరించారట చంద్రబాబు… ఈ సమయంలో కొంచెం దూరంలో ఉన్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ చంద్రబాబు ఉగ్ర రూపాన్ని చూసి.. తాను బ్లాక్ షర్ట్ వేసుకోకపోవడంతో నెమ్మదిగా జారుకున్నారట.

ఇక బ్లాక్ షర్ట్ ప్రభావమో.. ఏమో కానీ.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శాసన మండలిలో ఫిబ్రవరి ఒకటిన టీడీపీ-బీజేపీ ఎమ్మెల్సీలు దాదాపు కలబడినంత పని చేశారు… బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజు వంటి వారు ఎప్పటిలాగానే టీడీపీ మీద విమర్శలు చేశారు.. అయితే ఎప్పుడూ కూల్‌గా ఉండే ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, సత్యనారాయణ రాజులు వారిమీదకు దూసుకెళ్లారు.. దీంతో టీడీపీ-బీజేపీ ఎమ్మెల్సీలు ఘర్షణ పడినంత పని చేయడంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో అదీ శాంతంగా ఉండే వాళ్లు తొడగొట్టేలా వ్యవహరించడం చూస్తుంటే.. కచ్చితంగా బ్లాక్ షర్ట్ మహిమేనంటూ చమత్కరించుకుంటున్నారు నేతలు…. మొత్తంగా చూస్తే.. బ్లాక్ షర్ట్ వ్యవహరం టీడీపీలో ఆసక్తికర చర్చకు దారి లేపింది…