Home News Politics

క‌న్నా కాపు..కాస్తారా?

సీనియ‌ర్ లీడ‌ర్‌కి బీజేపీ ప‌గ్గాలు

పిట్ట‌పోరు పిట్ట‌పోరు పిల్చి తీర్చింద‌న్న‌ట్లు ఏపీ బీజేపీలో నాయ‌క‌త్వ‌పోరుని చివ‌రికి క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ తీర్చారు. సోమువీర్రాజుకా… మాణిక్యాల‌రావుకా.. మ‌రొక‌రికా అన్న సస్పెన్స్‌కి తెర‌దించుతూ చివ‌రికి పార్టీని వీడ‌తార‌నుకున్న మాజీమంత్రి క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌వైపే మొగ్గింది బీజేపీ అధినాయ‌క‌త్వం. కాంగ్రెస్‌నుంచి వ‌చ్చిన క‌న్నాకు ఇంత పెద్ద బాధ్య‌త ఇవ్వ‌డం క‌మ‌లంపార్టీలో చాలామందికి మింగుడుప‌డ‌క‌పోయినా ఎవ‌రూ కిక్కురుమ‌న‌టంలేదు. సోమువీర్రాజుకు త‌ప్ప మ‌రెవ‌రికి ఇచ్చినా ఫ‌ర్లేద‌ని పార్టీ నాయ‌క‌త్వం ముందు ఆప్ష‌న్ పెట్టిన నేతలెవ‌రూ నోరెత్తే ప‌రిస్థితి లేదు.

బీజేపీని వీడ‌బోతున్న‌ట్లు కొన్నాళ్ల‌క్రితం ప్ర‌క‌టించిన క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా సిద్ధంచేసుకున్నారు. కానీ హ‌ఠాత్తుగా ఆయ‌న అస్వ‌స్థ‌తకు గురై ఆస్ప‌త్రిలో చేర‌టంతో ఆ కార్య‌క్ర‌మం ఆగిపోయింది. త‌ర్వాత చేర‌తార‌నుకుంటే తెరవెనుక చాలా ప‌రిణామాలు జ‌రిగిపోయాయి. పార్టీని వీడొద్ద‌ని బుజ్జ‌గించిన బీజేపీ అధినాయ‌క‌త్వం చివ‌రికి ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌గ్గాల్ని అప్ప‌గించి పెద్ద‌పీట వేసింది. టీడీపీతో తెగ‌దెంపుల త‌ర్వాత ఏపీలో ఎలాగైనా బ‌ల‌ప‌డాల‌నుకుంటున్న బీజేపీకి క‌న్నాపై పెద్ద బాధ్య‌త‌నే మోపింది. టీడీపీ-బీజేపీల మ‌ధ్య మిత్ర‌బంధం ఉన్న‌ప్పుడే చంద్ర‌బాబుపై ఒంటికాలిపై లేచిన క‌న్నా ఇప్పుడిక ఏ స్థాయిలో విరుచుకుప‌డ‌తారో చూడాలి.

కాంగ్రెస్‌లో సుదీర్ఘ‌కాల అనుబంధ‌మున్న క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ నేదురుమ‌ల్లి నుంచి వైఎస్ దాకా ఎవ‌రు ముఖ్య‌మంత్రి అయినా కేబినెట్‌లో త‌న బెర్త్‌కి ఢోకా లేకుండా చూసుకున్నారు. గ్రూపు రాజ‌కీయాల‌కు కొద‌వ‌లేని కాంగ్రెస్‌లోనే నెట్టుకొచ్చిన క‌న్నాకి బీజేపీ బాధ్య‌త పెద్ద బ‌రువు కాబోదు. వేరే పార్టీనుంచి వ‌చ్చిన నాయ‌కుడికి రాష్ట్ర ప‌గ్గాలు అప్ప‌గించే ఆన‌వాయితీలేని బీజేపీ.. త‌న‌కోసం వాటిని ప‌క్క‌న‌పెట్ట‌టంతో క‌న్నా కూడా త‌న ముద్ర చూపించేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఖాయం. అయితే రాష్ట్రాన్ని విభ‌జించింది క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ పాత పార్టీ కాంగ్రెస్సే. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోంద‌ని టీడీపీ ప్ర‌జ‌ల్లోకెళ్తున్న స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి ఎలా వెళ్తారు? ఏ విధంగా మెప్పిస్తార‌న్న‌దానిపైనే ఆయ‌న‌తో పాటు పార్టీ భ‌విష్య‌త్ కూడా ఆధార‌ప‌డి ఉంది.