Home News Stories

అరకు డ్రామా ఆసక్తికరంగా ఉందే…?

SHARE

ఆ ఇద్దరూ తండ్రీ కూతుళ్లు. అంతకు మించి రాజకీయవేత్తలు. తండ్రేమో ఉన్నత పదవులు కట్టబెట్టిన పార్టీకి భవిష్యత్తు లేదని జెండా మార్చేశారు. కూతురు మాత్రం అదే పార్టీని నమ్ముకుని…తండ్రిపైనే ప్రత్యర్థిగా పోటీకి దిగారు. ఉన్నత కుటుంబానికి చెందిన ఆ తండ్రీ కూతుళ్ల పోటీ ఎలా ఉండబోతోంది? రక్తబంధాలను పక్కనపెట్టిన రాజకీయంలో చివరికి నెగ్గుకొచ్చేదెవరు?

కురుపాం రాజవంశీకుడు, విజయనగరం జిల్లాలో పేరొందిన రాజకీయనాయకుడు కిషోర్ చంద్రదేవ్ అరకు పార్లమెంట్ సీటునుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఈసారి టీడీపీ నుంచి బరిలో ఉండటంతో ఏజెన్సీ రాజకీయం మారిపోయింది. పార్టీ వీడిన నాయకుడికి చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం…కూతురినే ప్రత్యర్థిగా ప్రయోగించింది. తండ్రి పార్టీ వీడినా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న కిశోర్‌ చంద్రదేవ్ కూతురు శృతిదేవి ఆ పార్టీ అరకు పార్లమెంట్‌ అభ్యర్థిగా తెరపైకి రావటంతో…తండ్రికూతుళ్ల పోరు ఆసక్తి కరంగా ఉంది.

విజయనగరం జిల్లాలో గజపతిరాజులు, బొబ్బిలిరాజుల తరువాత చెప్పుకోదగ్గ వంశం కురుపాం రాజులు. కొండదొరలుగా పేరున్న కురపాం రాజవంశం నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ జాతీయ స్థాయి నేతగా ఎదిగి కేంద్ర మంత్రి హోదాతో పాటు అనేక పదవులు పొందారు. 1980, 1984, 2004 ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. 1994 నుంచి 2000 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో అరకు నుంచి ఐదోసారి ఎంపీగా గెలిచారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా, యూపీఏ టూలో కేంద్ర గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ మంత్రిగా కీలకపదవుల్లో ఉన్నారు కిశోర్‌ చంద్రదేవ్‌.

2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా అరకు నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పట్నించీ సైలెంట్‌గా ఉన్న కిషోర్ చంద్రదేవ్ ఎన్నికలముందు తెరపైకొచ్చారు. కాంగ్రెస్‌కి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అరకు పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సీనియర్‌ నేత పార్టీ మారటంతో వైరిచర్ల కుటుంబంలో సరికొత్త రాజకీయం మొదలైంది. తండ్రి కిషోర్ చంద్రదేవ్‌కి తగ్గ వారసురాలుగా రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంటూ కాంగ్రెస్‌లో కీలక నాయకురాలిగా ఎదిగిన ఆయన కూతురు శృతీదేవి ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు.

కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అరకు ఎంపీ స్థానం నుంచి శృతీదేవిని అభ్యర్థిగా ప్రకటించింది. కిషోర్ చంద్ర దేవ్ కాంగ్రెస్‌కి భవిష్యత్తే లేదని బైబై చెప్పేస్తే.. చక్రం తిప్పేది తమ పార్టీనేనంటూ ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు కిశోర్‌చంద్రదేవ్‌ కూతురు శృతీదేవి. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ శృతీదేవి ప్రచారంలో దూసుకుపోతుండటంతో…కిషోర్ చంద్రదేవ్ అనుచరులు అయోమయంలో పడ్డారు. తండ్రి ఓ పార్టీలో, కూతురు మరో పార్టీలో ఉండటంతో…ఎవరివైపుండాలో కొందరు తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి కురుపాం కోటలో రసవత్తర రాజకీయం నడుస్తోంది.