Home News Politics

ఆ ముగ్గురు నేతల నుంచి పిలుపులొస్తున్నాయ్ !

SHARE

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఏపీలో పాలిటిక్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏకంగా పార్టీ అధినేతల నేరుగా ఓటరుతోనే సంప్రదింపులు జరుపుతున్నారు. ఓటరు నాడి పట్టుకునేందుకు ప్రధాన పార్టీల అధినేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నేరుగా వారినే సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి జరిగే ఎన్నికలు ఏకంగా కొన్ని పార్టీల భవిష్యత్‌ రూపు రేఖలు మార్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధినేతలు గెలుపు కోసం ఇప్పటి నుంచే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బహిరంగ సభలు, మీడియా ద్వారానే కాకుండా నేరుగా ఓటర్లను సంప్రదిస్తున్నారు. తద్వారా ఓటర్ల మనసులో మాట తెలుసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు…..

టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తన పాలన గురించి ఎలా ఉందంటూ ఫోన్‌ ద్వారా సంప్రదించి వాకబు చేస్తున్నారు. గతంలో డయల్‌ 1100కు ఫోన్‌ చేసి సమస్యలు విన్నవించిన వారికి ఫోన్‌ చేసి మీ సమస్య పరిష్కారం అయిందా లేదా అని తెలుసుకోవడంతో పాటు పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయం గురించి అడుగుతున్నారు. వాయిస్‌ రికార్డు ద్వారా ఈ విధంగా చేస్తున్నారు. దీనికి వచ్చిన సమాధానాలను బట్టి పాలనలో మార్పులు తీసుకువస్తూ వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా ఆయన ముందుకు సాగుతున్నారు.


నేను మీ జగన్మోహనరెడ్డిని, ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సమయంలో నేను మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మీ గురించి విన్నాను. మీ సేవలు సమాజానికి మరువలేనివి. ఇదే స్ఫూర్తిని మీరు వైసీపీ కోసం కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. పార్టీ గెలుపు కోసం అవసరమైన సలహాలు, సూచనలు మీ నుంచి నేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందుకోసం నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అంటూ జగన్‌ ఓటర్లకు లేఖలు రాస్తున్నారు. ఆయన సంతకంతో కూడిన లేఖలు అందుకున్న వారు అందులో ఫోన్‌ నెంబర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇందుకోసం లేఖలో ప్రత్యేకంగా ఓ నెంబర్‌ను కేటాయించారు. ఇందులో వాట్సాప్‌ నెంబర్ కు మీ నియోజకవర్గానికి సంబంధించి సలహాలు సూచనలు అందించ్చని పేర్కొన్నారు. స్థానికంగా కొద్దిగా పలుకుబడి కలిగిన వారందరికీ ఆ పార్టీ నుంచి ఇలాంటి లేఖలు వస్తున్నాయి. దీని వల్ల ప్రజల్లో పార్టీకి గుర్తింపు తీసుకు రావడంతో పాటు దాన్ని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నాలను వైసీపీ ప్రయత్నిస్తోంది.

ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సైతం ఎన్నికల ప్రచార ప్రక్రియను ప్రారంభించారు. మీడియా పరంగా ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు స్థానిక నాయకులు శ్రీకారం చుట్టారు. ప్రచార రథాలను సైతం సిద్ధం చేశారు. అయితే జనసేన పార్టీ విధానాలు, నినాదాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ ఏకంగా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసుకుంది. ఈ శాఖ జనసేన నినాదాలను తయారు చేసి కార్యకర్తల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. అదేవిధంగా పవన్‌ మాటలు, పాటలను మిక్స్‌ చేసి వాటిని అన్ని గ్రామాల్లో ప్రచారం చేసే కార్యక్రమానికి ఈ శాఖ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఇలా జనసేన అధినేత పవన్‌ సైతం ఓటరు నాడి పట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు.