Home News Stories

ఏపీలో వార్ షురూ…!

SHARE

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశాయి. ఇక అభ్యర్థుల ప్రకటనలో జనసేన పార్టీ కుడా ఊహించని విధంగా మిగతా పార్టీల కంటే ముందుండటం విశేషం. నాలుగు పార్లమెంట్ స్థానాలకు, 32 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన అధికారికంగా విడుదల చేసింది. పట్టుమని పదిహేను రోజులు‌మాత్రమే ప్రచారానికి‌ ఉండటంతో అన్ని పార్టీలు సమరశంఖం పూరించనున్నాయి. ప్రతిష్టాత్మకంగా‌జరుగుతున్న ఎన్నికలు అవ్వడంతో ప్రచారంలో‌ మాటల తూటాలు‌ పేలనున్నాయి.

ఇక అధికార పార్టీ తెలుగుదేశం కూడా ఈ సాయంత్రం అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశముంది. గురువారం సాయంత్రం పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. అనంతరం మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక వైఎస్సార్ సీపీ కూడా 16వ తేదీన ఇడుపులపాయలో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశాయి.

ఇలా ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను మరో 5 రోజుల్లోపు ప్రకటించడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు పార్టీ ప్రధాన కార్యాలయాలు, పార్టీ అధినేతల ఇళ్ల ముందు క్యూ కడుతున్నారు. కొందరికి నో ఎంట్రీ బోర్డ్ పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇటీవల వైసీపీ టికెట్ ఆశించి జగన్ ఇంటికెళ్లిన పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక టీడీపీ,వైసీపీల్లో సత్తెనపల్లి టిక్కెట్ కోసం నేతల మధ్య‌ పెద్ద‌వార్ నడుస్తుంది.

అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన పార్టీల అధినేతలు, పార్టీలు మారుతున్న నేతలు, అలకలు, బుజ్జగింపులు, అసమ్మతి నేతల ఆందోళనలు, తామున్న పార్టీలో అన్యాయం జరిగిందంటూ నేతలు ఆరోపణలు, టికెట్ ఖాయమైన నేతల ప్రలోభాలు, అడ్వాన్స్‌గా కొని భద్రంగా దాచి పెట్టుకున్న మద్యం బాటిళ్లు, ఓట్ల కొనుగోలుకు తరలుతున్న కోట్ల కట్టలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ రాజకీయాల్లో చాలానే మార్పులు చోటుచేసుకున్నాయి. ఏదేమైనా ఏప్రిల్ 11నే ఎన్నికలు జరగనుండటంతో ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.