Home News Politics

ఏపీలో పోలీస్ vs పొలిటికల్ లీడర్స్…

SHARE

ఏపిలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది … అది ప్రభుత్వ అధికారుల‌ను కూడా గట్టిగానే తాకుతోంది … ప్రతి ప‌క్ష పార్టీలు డీజీపీ, పోలీసు శాఖ‌ను టార్గెట్ చేయ‌డం ప్రభుత్వ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది… అసలు బీజేపీ,వైసీపీలు పోలీసు బాస్ ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం వెనుక కార‌ణాలు ఏంటి?… జ‌ర‌గ‌బోయే ప‌రిణామ‌లకు సంబంధించి ..ప్రభుత్వ, రాజ‌కీయ వ‌ర్గాల్లో దీనిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది…


ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు ఏపీలో రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధాన అధికారిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం మార్చింది… ఈ ఊహించ‌ని ప‌రిణామం పై విస్తృత చ‌ర్చ జ‌రిగింది.. అయితే రాజ‌కీయ పార్టీల నుంచి ఉన్న ఆరోప‌ణ‌లు, వ‌స్తున్న నివేదికల ఆదారంగానే ఈ మార్పు జ‌రిగింద‌నే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది… అదే స‌మ‌యంలో కీలక పోస్టుకు సంబంధించి ఇప్పుడు మ‌రో మార్పు ఉండోబోతుంద‌నే వాద‌న ప్రభుత్వ వ‌ర్గాల్లో భ‌లంగా వినిపిస్తోంది… ప్రస్తుత రాష్ట్ర డీజీపీ ఆర్పీ.ఠాకూర్ ను ఎన్నిక‌ల స‌మ‌యంలో మారుస్తార‌నే ప్రచారం విస్తృతంగా జ‌రుగుతోంది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలను ప‌రిశీలిస్తే ఏదో జ‌ర‌గ‌బోతుంద‌నే అభిప్రాయాన్ని ప్రభుత్వ వ‌ర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఏపిలో బీజేపీ మొద‌టినుంచి పోలీసు శాఖ తీరుపై ఆరోప‌ణ‌లు చేస్తోంది… టీడీపీతో కమలం పార్టీ తెగ‌దెంపుల త‌రువాత అనేక సంద‌ర్భాల్లో పోలీసు శాఖ పై విమ‌ర్శలు గుప్పించింది. బీజేపీ నేత‌ల ఇళ్లపై దాడులు జ‌రుగుతున్నా… కమలం పార్టీ నేత‌ల‌ను కేసుల పేరుతో వేధిస్తున్నా పోలీసు శాఖ అధికారులు స్పందించ‌డం లేద‌ని ఆరోపిస్తోంది .. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు నానా యాగీ చేసిన పోలీసులు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని…ప్రభుత్వ ప్రోద్భలంతో పోలీసు శాఖ ఏక‌ప‌క్షంగా ప‌ని చేస్తుంద‌ని బిజెపి ముఖ్యనేత‌లు అంతా ఎలుగెతుతున్నారు … ఒకానొక సంద‌ర్భంలో రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని రాష్ట్రప‌తి పాల‌న తేవాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయం కూడా బిజెపి నేత‌లు వ్యక్తం చేశారు . ..

తాజాగా వైసీపీ కూడా ఇప్పుడు అదే ఆరోప‌ణ‌లు మొద‌లు పెట్టింది. పోలీసు శాఖ‌ను ప్రభుత‌్వం పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకుంటుంద‌ని…ప్రమోష‌న్ల విష‌యంలో ఒకే వ‌ర్గానికి అవ‌కాశం ఇచ్చార‌ని జ‌గ‌న్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి . .. డిజిపితో స‌హా కొంద‌రు పోలీసు అధికారుల ను ఈ ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని వైసిపి అధినేత కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు… జ‌గ‌న్ ఫిర్యాదుతో ఈ వ్యవ‌హారం మ‌రోసారి చ‌ర్చలోకి వ‌చ్చింది. జ‌గ‌న్ పై క‌త్తి దాడి విష‌యంలో డిజిపి రియాక్షన్ పై వైసిపి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది … విచార‌ణ కూడా ప్రారంభం కాకుండానే నిందితుడు వైసీపీ అభిమాని అంటూ డీజీపీ వ్యాఖ్యానించడం పూర్తిగా కేసును ప‌క్కదారి ప‌ట్టించ‌డ‌మే అన్నది వారి వాద‌న‌…

ఇక కృష్ణా జిల్లా మైలవరంలో వైసీపీ,టీడీపీ నేతల మధ్య పోటీలో పోలీస్ శాఖ ఇరుక్కుపోయింది. మైలవరం వైసీపీ ఇంచార్జ్ వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల్లో సహకరించాలంటూ పోలీసులకు డబ్బు ఎరచూపాడన్న ఆరోపణ ఇక్కడ సెగలు పుట్టిస్తుంది. ఇక్కడి నేతలు పరస్పరం కేసులు పెట్టుకుని ధర్నాలు చేస్తు చేస్తున్న హడావిడి పోలీస్ బాసులను రాజకీయ రణరంగంలోకి లాగింది. ఈ ఆరోపణలు అన్ని కలగలిపి పోలీస్ బాస్ పోస్ట్ కి ఎసరు తెచ్చేలా తయారైంది. ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చిన త‌రువాత ఈ ఫిర్యాదులు, ఆరోప‌ణ నేప‌థ్యంలో డీజీపీ ని త‌ప్పిస్తార‌ని ప్రచారం జ‌రుగుతోంది…

రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా కీల‌క మార్పులు ఉండే అవ‌కాశం ఉండే పరిస్థితి కనిపిస్తోంది… ప్రతిప‌క్ష నేత స్వయంగా పేర్లు పెట్టి మ‌రీ ఆరోప‌ణ‌లు చేస్తుండటంతో .. ఖ‌చ్చితంగా కొందరి పైన అయిన చ‌ర్యలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది…