Home News

ఏపీ డీఎస్పీ పోస్టుల్లో కులాల కుంపటి…!

SHARE

ఏపీలో డీఎస్పీల బదిలీలు కులాల కుంపటిని రాజేస్తున్నాయి .. కమ్మ , రెడ్డి కులాలకు చెందిన అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నాయి .. టీడీపీ హయాంలో కమ్మ వారికి ప్రయారిటీ దక్కిందని… ఇప్పుడు రెడ్లకు పెద్దపీట వేస్తున్నారని.. మరి మా పరిస్థితి ఏంటని మిగిలిన కులాల డీస్పీలు ప్రశ్నిస్తున్నారు .. మరోవైపు ఇప్పటికే హెడ్ క్వార్టర్‌లో వీఆర్‌లో ఉన్న కమ్మ డీఎస్పీలకు ఇంతవరకూ పోస్టింగ్ ఇవ్వకపోవడంపై డిపార్ట్‌మెంట్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది..

ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన బదిలీల ఉత్తర్వులు డీఎస్పీల మధ్య కులాల చిచ్చు రేపినట్లు కనిపిస్తోంది .. 38 మంది డీఎస్పీలను బదిలీ చేస్తే అందులో 16మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ఉండటమే అందుకు కారణం.. గత నెలలో హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేసి వీఆర్‌లో ఉంచిన 31 మందికి పోస్టింగులు ఇవ్వకుండా .. ఇప్పుడు ఇంతమందికి పోస్టింగులు ఇవ్వడంతో ఆ డీఎస్పీలు అంతా మండిపడుతున్నారు.. అందులోనూ అలా వీఆర్‌లో ఉన్న వారిలో 15మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వివాదానికి కారణమవుతోంది ..

పొలిటికల్ వార్‌లో తాము నలిగిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు డీఎస్పీలు .. ఐపీఎస్‌ మాదిరిగా కేడర్లు ఉండి ఉంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయేవారిమంటున్నారు .. ఇప్పుడు ఏపి పోలీస్‌ డిపార్ట్‌మెంట్లో ఇదే పెద్ద చర్చగా మారింది … క్రమశిక్షణ కలిగిన డిపార్ట్‌మెంట్ అవ్వడంతో బయటకు చెప్పలేకపోతున్నారు కానీ … చాలా మంది డీఎస్పీలు సన్నిహితుల వద్ద ఈ బదిలీల వ్యవహారంపై గగ్గోలు పెడుతున్నారు … పార్టీల పొలిటికల్ ఫైట్‌లో తాము బలైపోతున్నామంటున్నారు .. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదని వాపోతున్నారు

వారందర్నీ వీఆర్‌కు పంపడం వెనుక పొలిటికల్‌ లెక్కలే కనిపిస్తున్నాయి .. ఎన్నికల ముందు భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి.. అందులో కమ్మ సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువ మంది ఉన్నారని.. తమకు నచ్చిన చోట టీడీపీ పోస్టింగులు ఇచ్చిందని అప్పట్లో ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి పదేపదే ఆరోపించారు… ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసేందుకు చంద్రబాబు తన సొంత సామాజికవర్గానికి చెందినవారికి పోస్టింగులు ఇచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు… ఇక ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అప్పట్లో టిడిపి పోస్టింగులు ఇచ్చిన డీఎస్పీలందరినీ బదిలీ చేసి వీఆర్‌లో పెట్టారు..గతంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలు పనిచేసిన చోట ఇప్పుడు రెడ్డి సామాజికవర్గాలకు చెందిన డీఎస్పీలకు పోస్టింగులు ఇచ్చారు…

అప్పట్లో టీడీపీ కమ్మ అధికారులకు పెద్దపీట వేసిందని వైసిపి ఆరోపణలు గుప్పించింది .. అదే క్రమంలో ఇప్పుడు రెడ్లకు జగన్ సర్కార్ పోస్టింగులు ఇస్తుంటే టీడీపీ కనీసం ఎందుకు నోరువిప్పడం లేదని మండిపడుతున్నారు డీఎస్పీలు .. తమ సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు సరే .. ఇతర సామాజికవర్గాలకు పనిష్‌మెంట్లు ఏంటని ఆక్రోశం వెల్లగక్కుతున్నారు … అయినా పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఉన్న తమకు ఇలా కులాలను అంటగట్టడం కరెక్ట్ కాదంటున్నారు….

ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని .. కేవలం ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్లోనే కులాల కుమ్మలాటలతో నలిగిపోతున్నామంటున్నారు .. పక్కన ఉన్న తెలంగాణలో కూడా ఇలాంటి కులాల రచ్చ లేదని కేవలం పనితీరు, సామర్ధ్యం ఆధారంగానే పోస్టింగులు ఇస్తారని చెప్పుకొస్తున్నారు… తెలంగాణలో ఏదైనా అవినీతి ఆరోపణలతో ఉన్నవారిని మాత్రమే వీఆర్ లో పెడతారని … క్యాస్ట్‌ ఫీలింగ్‌తో కాదంటున్నారు .. ఐపీఎస్‌ల మాదిరిగా తమకు కేడర్లు ఉండిఉంటే .. డిప్యూటేషన్ పై తెలంగాణకు వెళ్తామంటున్నారు వీఆర్‌లో ఉన్న డీఎస్పీలు … మొత్తమ్మీద వీఆర్‌లో ఉన్నవారిలో కమ్మ అధికారులతో పాటు బలహీనవర్గాలకు చెందిన డిఎస్పీలు కూడా ఉన్నారు .. వారందర్నీ టిడిపి అనుకూలురన్న ముద్రతోనే పక్కన పెట్టడం ఇప్పుడు డిపార్ట్‌మెంట్లో ఆందోళనకు కారణమవుతోంది ..