Home News Stories

ఏపీ కొత్త జేఏసీ వెనుక గులాబీ పార్టీ…?

SHARE

ఏపీలో జరుగుతున్న ప్రతి కీలక పరిణామం వెనుక ఎన్నికల కోణం ఉంటోందా..? ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని .. అన్ని వర్గాల్లోనూ గ్రూప్‌లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కన్పిస్తోంది. ఇదే తరహాలో ఉద్యోగ వర్గాల్లోనూ చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోందా..? ఈ ఆలోచనకు బీజం పక్క రాష్ట్రంలోనే పడిందా..? ప్రస్తుతం ఏపీ ఉద్యోగ వర్గాల్లో ఇదే అంశంపై హాట్ డిస్కషన్ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార-ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి… ఈ క్రమంలో కుల సమీకరణాలు మొదలుకుని.. ఉద్యోగ, కార్మిక అంశాలను బేరీజు వేసుకుంటూ ఆయా వర్గాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి పార్టీలు… ఆయా వర్గాలను తమకు అనుకూలంగా మలుచుకోవడమో.. లేకుంటే ఆయా వర్గాల్లో చీలిక తేవడమోననే అంశాలపై ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి… సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునే క్రమంలో కావచ్చు.. తాజాగా డేటా చోరీ.. ఫారం-7 వంటి అంశాల్లో కావచ్చు.. ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి పొరుగు రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్ఎస్ సహకరిస్తుందనే వాదనలను బలంగా లేవనెత్తే ప్రయత్నం చేస్తోంది టీడీపీ… తలసాని శ్రీనివాస్ యాదవ్ అయిన దానికి కాని దానికి ఏపీ రాజకీయాలపై రెస్పాండ్ కావడం.. డేటా చోరీ వ్యవహరం మొత్తం తెలంగాణ కేంద్రంగానే జరగడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నాయి టీడీపీ వర్గాలు…

అలాగే ఉద్యోగ వర్గాల్లో కూడా చీలిక తెచ్చే ప్రయత్నాలు జరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందనేది ఏపీలోని ఉద్యోగ వర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చ.సచివాలయంలో ఇరిగేషన్ శాఖ సెక్షన్ ఆఫీసరుగా పని చేసే వెంకట్రామి రెడ్డి గతంలో సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో ఉప్పులూరి మురళీకృష్ణ ప్యానెల్‌కు వ్యతిరేకంగా పోటీ చేశారు… అయితే నాటి పోటీలో వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఓటమి పాలైంది… ఆ తర్వాత నుంచి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను.. ప్రభుత్వం తీరును వివిధ సందర్భాల్లో ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ వెంకట్రామిరెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారనే విషయం ఉద్యోగులందరికీ తెలిసిన విషయమే…

అయితే ఆయన తాజాగా ప్రస్తుతమున్న ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా కొత్త జేఏసీని ఏర్పాటు చేయడమనే అంశమే ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది… ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాల్లో చీలిక తెచ్చే క్రమంలోనే వెంకట్రామిరెడ్డి ఈ తరహాలో కొత్త ఉద్యోగ సంఘం ఏర్పాటుకు తెర లేపారనే చర్చ జరుగుతోంది… దీని వెనుక పొరుగునున్న తెలంగాణ ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు నేతల ప్రొదల్భం కూడా ఉందంటున్నారు. లేకుంటే ఇప్పటి వరకు గుర్తుకు రాని కొత్త ఉద్యోగ సంఘాల ఏర్పాటు అంశం.. సడెన్‌గా ఎందుకు తెర మీదకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు…

ఏపీని టార్గెట్‌ చేసుకుంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో భాగంగానే ఈ వ్యవహరం కూడా నడిచిందనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది… ఇప్పటికే ఏపీలోని ఉద్యోగుల్లో కులపరమైన భావాలు పెరిగేలా బీజాలు పడ్డాయని అంటున్నారు… కింది స్థాయి ఉద్యోగి మొదలుకుని.. ఐఏఎస్ స్థాయి అధికారుల వరకు కులాలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో యధేచ్ఛగా చర్చించుకుంటున్నారని.. గతంలో ఈ తరహా వ్యవహరం ఎక్కడా లేదని కొందరు సీనియర్‌ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .. ఇలాంటి పరిణామాలను క్రియేట్‌ చేయడంలో కొందరు సక్సెస్ అయ్యారని.. అంటున్నారు.

తాజాగా డేటా చోరీ, ఫారం-7 ఎపిసోడుకు సంబంధించి వేసిన రెండు సిట్‌ బృందాల్లో ఓ కులానికి ప్రాతినిధ్యం లేదనే రీతిలో కామెంట్స్ రావడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు… ఈ విధంగా ఉద్యోగుల్లో లేనిపోని అనుమాన బీజాలను నాటే ప్రయత్నం చేస్తున్నారనేది ఉద్యోగ సంఘాల ఆందోళన.. ఇదే క్రమంలో కొత్తగా ఉద్యోగ సంఘం ఏర్పడడం వెనుక కూడా కచ్చితంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరి ప్రోద్భలం ఉండే ఉంటుందని.. దీనికి సంబంధించి త్వరలోనే మరిన్ని ఆధారాలు రాబోతున్నాయంటున్నారు కొందరు ఏపీ ఉద్యోగ సంఘ నేతలు… మొత్తమ్మీద ఉద్యోగ సంఘాల్లో చీలక అంశం ఏపి సచివాలయంలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది..