Home News Politics

ఏపీలో జంప్ జిలానీ పాలిటిక్స్…!

SHARE

తలపండిన రాజకీయ దిగ్గజాలు, పొలిటికల్‌గా ప్రభావితం చేయగల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న నేతలు సైతం ఇప్పుడు పార్టీలు మార్చేస్తున్నారు… దాంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం అంచనాలకు అందకుండా తయారవుతోంది … క్యాస్ట్‌ కార్డులను సైతం పక్కన పెట్టేసి కరుడుగట్టిన నేతలు సైతం ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సిద్దమవుతుండటం ఆసక్తి రేపుతోంది.. దాంతో ఏ క్షణం ఏం జరుగుతుందో.. ఏ నేత ఏ పార్టీలో ఉంటారో అన్నది అంతుపట్టకుండా తయారైంది…


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది .. ఎన్నికలు సమీపిస్తుండటంతో వలసల రాజకీయం రసవత్తరంగా మారుతోంది… కొందరు నేతల ఫిరాయింపులతో పార్టీల సామాజికవర్గ లెక్కలు కూడా మారిపోతున్నాయి .. దివంగత కాపునాడు నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడానికి సిద్దమవ్వడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు…

కోస్తా జిల్లాల్లో పార్టీలను అంటిపెట్టుకొని ఉన్న సామాజిక వర్గాల సమీకరణాలు మారడానికి ఈ చేరిక దోహదం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది… వంగవీటి రాధా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకూ టీడీపీ వైపు రాలేదు… మొదట కాంగ్రెస్ లో ఉన్న ఆయన… తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు… ఆ తర్వాత వైసీపీకి మారారు… వంగవీటి రంగా హత్య తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు సామాజిక వర్గాలు రాజకీయంగా ఆయా పార్టీల వెంట నడుస్తూ వచ్చాయి … ఆ పరిస్థితిని మార్చేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గతంలోనే ప్రయత్నించారు… అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రంగా సతీమణి వంగవీటి రత్నకుమారిని టీడీపీలోకి తీసుకున్నారు… ఆ క్రమంలో దేవినేని నెహ్రూని కూడా టిడిపికి దూరంగా పెట్టారు..


దాంతో నెహ్రూ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు… దీంతో ఫలానా సామాజికవర్గం నేత ఫలానా పార్టీలోనే ఉంటారనే ముద్ర కొంత తగ్గింది… ఆ సమయంలోనే రంగా కుటుంబం కూడా కాంగ్రెస్ లోకి వెళ్లింది… నెహ్రూ, రంగా కుటుంబాలు రెండూ అలా కొంత కాలం కాంగ్రెస్ లోనే ఉండిపోయాయి… అయితే వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యంలో చేరడంతో మళ్లీ దారులు వేరయ్యాయి… నెహ్రూ చనిపోవడానికి కొద్దిగా ముందు కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు… ఆయన తనయుడు అవినాష్‌ టిడిపిలో యూత్‌ లీడర్‌గా ఫోకస్‌ అవుతున్నారు.. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరితే కోస్తాలో ప్రబలంగా ఉన్న కుల విభేదాలు కొంత తగ్గుముఖం పడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక సినీ హీరో ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీ నుంచి ఇప్పుడు టిడిపిలో చేరనున్నారు… ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిన నాటి నుంచి కృష్ణ కుటుంబం ఆ పార్టీకి దూరంగానే ఉంది… 1989 ఎన్నికల్లో కృష్ణ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు … ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొన్నారు… చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కృష్ణ సతీమణి విజయనిర్మల టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలై… పాలిటిక్స్‌కి దూరంగా ఉండిపోయారు … అయితే ఆదిశేషగిరిరావు మాత్రం సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు… తర్వాత వైసీపీలో చేరారు. ఆదిశేషగిరిరావు జగన్‌ పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు… అమరావతిలో జగన్‌ సొంత ఇంటి నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించారన్న టాక్‌ ఉంది… అంత సన్నిహితంగా మెలిగిన ఆయన కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడం వైసిపి శ్రేణులను ఆశ్చర్యపరుస్తోందంట… ఇక మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్ ను వీడి జనసేనలో చేరారు..


మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరి సొంత పార్టీకి ట్విస్ట్‌ ఇచ్చారు … పోయిన ఎన్నికల ముందు నుంచీ ఆయన నరేంద్ర మోడీతో సన్నిహితంగా ఉండే వారంటారు.. బీజేపీలో యాక్టివ్‌గా ఉండటంతో టీడీపీ సీనియర్‌ నేత గోరంట్లను పక్క నియోజకవర్గానికి మార్చి, పొత్తులో ఆకులకు రాజమండ్రి సీటును ఇచ్చారు… అలాంటాయన ఇప్పుడు బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు.


ఇక కోట్ల ఫ్యామిలీ… ఆ పేరు వినగానే గుర్తుకొచ్చేది కాంగ్రెస్సే … కొన్ని దశాబ్దాలుగా కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న రాజకీయ కుటుంబం అది… ఇప్పుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరే అవకాశాలున్నాయంటున్నారు … కాంగ్రెస్‌కు టీడీపీతో పొత్తు ఉండాలని ఆయన ఆకాక్షించారంట … అయితే పొత్తు ప్రతిపాదన అటకెక్కడంతో కోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంట.. పొత్తుల్లేకుంటే కాంగ్రెస్‌ మనుగడ కష్టమే అని భావిస్తున్నా ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది… అయితే ఆయనను చేర్చుకోవడానికి వైసీపీ కూడా ప్రయత్నిస్తుందంట…


కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత డీఎల్‌ రవీంద్రా రెడ్డి టీడీపీలోకి రావడంపైనా చాన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి .. ఇటీవల ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి 45 నిమిషాలపాటు చర్చించినట్లు తెలిసింది… మైదుకూరు నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేయాలని డీఎల్‌ భావిస్తున్నారంట.. మొత్తమ్మీద క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ పక్కన పెట్టేసి నేతలు పార్టీలు మారడానికి సిద్దమవుతుండటంతో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి..