Home News Stories

ఆంధ్రాలో ఫ్యామిలీ రిలేషన్ పాలిటిక్స్…!

SHARE

ఏపీలో ప్రస్తుతం ఇంటి పోరు రాజకీయం ఆసక్తి రేపుతోంది … ఓ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నవాళ్లనో.. కీలకమైన వాళ్లనో ఇరుకున పెట్టే క్రమంలో కొత్త రకం రాజకీయానికి తెర లేస్తోంది … కీలక నేతలను తమ పార్టీల్లోకి తెచ్చే ప్రయత్నం కుదరకపోతే .. ఆ నేతల బంధువులు తమ పార్టీలోకి వచ్చేలా స్కెచ్‌లు గీస్తున్నాయి ప్రధాన పార్టీలు.. అలా ప్రత్యర్ధి నేతల సొంతింట్లోనే రాజకీయ కుంపటి రాజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి ..ప్రధానంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఈ తరహా రాజకీయం హాట్‌టాపిక్‌గా మారుతోంది..

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది… ఓవైపు పక్క పార్టీల్లోని నేతలకు గాలమేస్తూ.. ప్రత్యర్థులను బలహీనపర్చాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తూనే .. మరోవైపు మైండ్ గేమ్ పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నాయి రాజకీయ పక్షాలు… తమను టార్గెట్‌ చేసుకున్న ప్రత్యర్ధి పార్టీల్లోని నేతలను .. వారు కూడా టార్గెట్ చేసుకునే క్రమంలో రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు… దీంట్లో భాగంగా ఏపీలో బంధు రాజకీయం రంజుగా సాగుతోంది…

బుద్దా నాగేశ్వరరావు, వర్ల రత్నం,మేడా విజయ శేఖర్ రెడ్డి.. ఇలా వీరి ఇంటి పేర్లు వింటే ఎవరికి సంబంధించిన వారో.. ఏ నేతలతో బంధుత్వం ఉందో ఇట్టే అర్థమైపోతోంది…. బుద్దా వెంకన్న సోదరుడు బుద్దా నాగేశ్వరరావు. బుద్దా వెంకన్న టీడీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతోంటే.. ఆయన సొదురుడు బుద్దా నాగేశ్వరరావు తాజాగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే వర్ల రామయ్య టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వైసీపీని వీలు చిక్కినప్పుడుల్లా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన సొదరుడు వర్ల రత్నం.. ఆయనా వైసీపీలో చేరారు. ఇక కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు… ఆయన సోదరుడు మేడా విజయ శేఖర్ రెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు.

ఆయా పార్టీల్లో కీలకంగా ఉండేవారిని తమ తమ పార్టీల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఓవైపు చేస్తూనే.. మరోవైపు ఈ తరహా వ్యూహాలను రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు… ఇదో రకంగా చూస్తే.. ఆసక్తిని రేకెత్తించే అంశంగానే చెప్పొచ్చు… బుద్దా వెంకన్న ఉదయం లేచింది మొదలు వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు… అలాగే వర్ల రామయ్య అదే పని మీద ఉంటారు… ఈ క్రమంలో వీరి బంధువులను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా సదురు నేతల ఇళ్లల్లోనే వైసీపీని విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు… అందుకే వారితో విబేధించి తమ పార్టీలోకి వచ్చేశారనే సంకేతాలు పంపడం ద్వారా ఆ నేతల క్రెడిబిలిటీని.. వారు చేసే కామెంట్లకు పెద్దగా విలువ లేకుండా చేయడమే ఈ తరహా రాజకీయం వెనుకున్న వ్యూహంగా కన్పిస్తోంది…

ఇదే క్రమంలో టీడీపీని వీడి వెళ్లిన మేడా మల్లిఖార్జున రెడ్డికి వరుసకు సొదరుడైన మేడా విజయ శేఖర్ రెడ్డి … మల్లిఖార్జున రెడ్డి నిర్ణయాన్ని తప్పు పడుతూ .. రాజంపేట నుంచి తానుపోటీ చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇది కూడా ఓ రకంగా మేడా మల్లిఖార్జునరెడ్డి వర్గాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే… తన బంధు వర్గాన్ని కూడా మేడా ఒప్పించలేకపోయారనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లడం టిడిపి వ్యూహంగా కనిపిస్తోంది … ఇదే సందర్భంలో మరో ఆసక్తికర పరిణామం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.. వైసీపీలో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి బావ మరిది ద్వారకానాధ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబుతో ఓసారి భేటీ అయ్యారు… ఆయన రాయచోటి ఎమ్మెల్యే టిక్కెట్ కూడా అడిగేశారంట… అఫ్‌కోర్స్‌ ఇంకా ద్వారకానాథ్‌కు గ్రీన్‌సిగ్నెల్‌ రాలేదనుకోండి…

ఆయా పార్టీల్లోని కీలక నేతలను టార్గెట్ చేసుకోవడానికి పార్టీ అధినాయకత్వాలు వారి వారి బంధుగణాలను ఏ విధంగా అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయో.. ఆయా పార్టీలను కూడా బంధువులు కూడా అదే విధంగా వాడేసుకోవాలని భావిస్తున్నారట… ప్రస్తుతం తమ రాజకీయ అవసరాలు తీరాలంటే.. ఆయా పార్టీల వీక్‌నెస్‌లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం సదురు నేతల బంధువులు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.. . కాల్ మనీ వ్యవహరంలో బుద్దా నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి… దీంతో అప్పట్లో బుద్దా వెంకన్న కూడా ఇబ్బందులు పడ్డారు… ఇప్పుడు ఆ ఆరోపణలు ఎదుర్కొన్న బుద్దా నాగేశ్వరరావుపై వైసిపి ఇక నుంచి ఆరోపణలు చేసే అవకాశం ఉండదు…. ఇదే సమయంలో బుద్దా వెంకన్న కూడా కాల్ మనీ ఎపిసోడులో సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారని తెలుగుదేశం వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది …

ఇక విజయసాయి రెడ్డి బావమరిది ద్వారకానాధ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. గతంలో టీడీపీ తరపున ద్వారకానాధ్ రెడ్డి లకిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు… తర్వాత వైసీపీ పంచన చేరారు… అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ద్వారకానాధ్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏ పార్టీ వైపు నుంచి లేదనే చెప్పాలి. దీంతో విజయ సాయి రెడ్డి బావమరిది హోదాలో ప్రస్తుతం టీడీపీలో రాయచోటి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీలో కూడా ద్వారకానాధ్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదనే విషయం తెలిసినా.. విజయసాయి రెడ్డి బంధువు అనే ట్యాగ్ లైనుతోనైనా టీడీపీలో తన పట్ల సాఫ్ట్ కార్నరుతో ఉండకపోతుందా..? అనే ఆశతో ద్వారకానాధ్ రెడ్డి ఉన్నట్టు కన్పిస్తోంది.

అయితే ఇదేదో కొత్త రాజకీయం కాదని అంటున్నారు… గతంలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లడం కూడా ఇదే తరహా రాజకీయమనే చెప్పాలి. ఇక తెలంగాణ టీడీపీలో కొనసాగుతున్న అరవింద్ కుమార్ గౌడ్ కూడా వెలుగులోకి వచ్చింది టీడీపీ నుంచి దేవెందర్ గౌడ్ నిష్క్రమణ తర్వాతేననే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విధంగా కొందరికి రిలెటివ్‌ పాలిటిక్స్‌ కలిసి వచ్చినా.. చాలా మందికి ఈ రాజకీయం కలిసి రాలేదనే చెప్పాలి..