Home News

కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం…!

SHARE

ఏపీ అసెంబ్లీ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్ చెబుతున్న జ్యూడిషియరీ కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ కీలక బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. మొత్తంగా నాలుగు బిల్లులను ఆమోదించిన ఈ సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేయడం కొంత విమర్శలకు దారి తీసింది.

ఏపీ శాసన సభ శుక్రవారం నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ లోకాయుక్త సవరణ బిల్లు, ఏపీ జీతాలు, ఫించన్ల చెల్లింపు-అనర్హతల తొలగింపు సవరణ బిల్లు, జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుకు అవసరమైన ఏపీ మౌళిక సదుపాయాల సవరణ బిల్లు, ఏపీ వ్యవసాయ ఉత్పత్తులు, జీవధన మార్కెట్ల సవరణ బిల్లులను ఏపీ శాసన సభ ఆమోదించింది. డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ లోకాయుక్త సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

అవినీతిరహితంగా టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి శ్రీకారం చుట్టేందుకు, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు జ్యుడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని గతం నుంచి సీఎం జగన్మోహాన్ రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు బిల్లును ఆమోదించడం ద్వారా కీలక జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇకపై హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జ్ అధ్వర్యంలో టెండర్ల పరిశీలన చేపడతారు. 100 కోట్ల రూపాయలు పైబడిన ప్రాజెక్టులు ఈ కమిషన్‌ పరిధిలోకి రానున్నాయి.

వివిధ గ్రాంట్లపై చర్చ జరిగే సందర్భంలో టీడీపీ ఆందోళనకు దిగింది. హోం పాలనకు సంబంధించిన గ్రాంట్లపై మాట్లాడాలని చంద్రబాబు కోరినా మైక్ ఇవ్వలేదు. ఈ క్రమంలో సభ నుంచి వాకౌట్ చేసింది టీడీపీ. అయితే కీలక జుడిషీయరీ కమిషన్ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సభలో లేకుండా వెళ్లిపోవడంపై ప్రతిపక్షంపై విమర్శలు వెల్లువెత్తాయి.