Home News Stories

బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్‌..

రంగుదేముంది...రూపంచూడండి..

SHARE

అందమంటే…పొందికైన శ‌రీరాకృతేనా? పాల‌నురుగులాంటి మేనిఛాయ‌నా? చూపుల‌తోనే క‌ట్టిప‌డేసే ముగ్ధ‌మ‌నోహ‌ర రూప‌మా? అందానికి కొల‌మానం లేదు. ఒక‌రికి సాదాసీదా ప‌క్కింట‌మ్మాయిలా క‌నిపించ‌వ‌చ్చు. మ‌రొక‌రికి అదే అమ్మాయి బ్ర‌హ్మ‌దేవుడు ముచ్చ‌ట‌ప‌డి త‌యారుచేసిన అందాల‌భ‌రిణ‌లా క‌నిపించొచ్చు. సో..అంద‌మ‌నేది రంగులో లేదు. ఆకారంలో లేదు. చూసే క‌ళ్ల‌లోనే ఉంది.

న‌లుపులోనూ ఆ అమ్మాయి ప్యూర్‌బ్లాక్‌. అయినా ఆమె అందం ఇప్పుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అవ‌కాశాలిస్తాం ర‌మ్మంటోంది. ఆమె పేరు యాయ్‌. మొన్న‌టిదాకా ఓ మామూలు కాలేజీ స్టూడెంటే. కానీ అదృష్టం ఎప్పుడు ఎలా ఎవ‌రి త‌లుపుత‌డుతుందో చెప్ప‌లేం. యాయ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. చూస్తుండ‌గానే టాప్ మోడ‌ల్ అయిపోయింది. ఒక‌ప్పుడు త‌ను న‌డిచి వెళ్తుంటే ఎవ‌రూ ప‌ట్టించుకునేవారు కాదు. అలాంటిది త‌న‌కోసం ఇప్పుడెంద‌రో ప‌డిగాపులు కాస్తున్నారు. ఓ ఆటోగ్రాఫ్ ఇచ్చినా చాల‌నుకుంటున్నారు.

సూడాన్‌కి చెందిన అనోక్ యాయ్‌ ఓవ‌ర్‌నైట్ సెల‌బ్రిటీ అయిపోవ‌డానికి కార‌ణం ఓ ఫొటోగ్రాఫ‌ర్‌. అత‌ను తీసిన ఫొటో యాయ్ జీవితాన్ని మార్చేసింది. ఓ రోజు కాలేజీలో ఉండ‌గా యాయ్‌ని ఫొటో తీసిన ఫొటోగ్రాఫ‌ర్ దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడంతే. ఆమె ఫొటోల‌కు లైక్‌లు, షేర్ల కుంభ‌కృష్టి కురిసింది. సోష‌ల్‌మీడియాలో ఫాలోవ‌ర్లు ఆమెతో దోస్తీకి క్యూక‌ట్టారు. దీంతో మోడ‌లింగ్ అవ‌కాశాలు వ‌చ్చిప‌డ్డాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాగ్‌జైన్స్ కూడా అనోక్ ఫొటోల‌కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నాయి.

వాషింగ్టన్‌ డీసీలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న పందొమ్మిదేళ్ల అనోక్‌యాయ్ అదృష్టం ఎలా ఉందంటే చివ‌రికి భారీ హాలీవుడ్‌ చిత్రాల్లోను ఆమెకి ఛాన్సులు వ‌స్తున్నాయి. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకునేందుకు ఫొటోషూట్‌ల‌కు భారీగా డిమాండ్ చేస్తోంది బ్లాక్‌బ్యూటీ. ఫొటోషూట్‌కి గంట‌కు 15వేల డాల‌ర్లు డిమాండ్‌ చేస్తోంది. అంటే ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర ప‌ది ల‌క్ష‌ల‌న్న‌మాట‌. అయినా వెన‌క్కిత‌గ్గ‌డంలేదెవ‌రూ. దీన్నిబ‌ట్టే అర్ధ‌మైపోవ‌డంలేదూ.. అందానికి రంగు కొల‌మానం కానేకాద‌ని.