Home News Politics

‘చీలిక’ కాదు ఓట్ల పంపిణీయే.. 2019 బరి ఆసక్తికరం…

SHARE

ఓట్ల చీలిక ఉంటుందా? ఎవరు ఎవరి ఓట్లు చీలుస్తారు?.’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల్లో తరుచూ ఆసక్తి కలిగించిన అంశం ఇదే. కానీ, 13 జిల్లాల నవ్యాంధ్రలో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ‘ఓట్ల చీలిక’ అనే పదానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. ప్రధాన పార్టీల మధ్య ఓట్ల పంపిణీ జరుగుతుందనే అంచనాయే దీనికి కారణం. తలపండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. చిన్నా చితకా కలిపి బరిలో నిలిచే పార్టీల సంఖ్య 90 దాటినా ఓటింగ్‌ షేర్‌ ప్రధానంగా నాలుగైదు పార్టీల మధ్యే ఉంటుందని అంచనా. టీడీపీ,వైసీపీ,జనసేన,బీజేపీ,కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా కనబడుతున్న టీడీపీ,వైసీపీ,జనసేన మధ్యే పోటీ ఉంది.

2009, 2014 సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఈసారి పోరు ఉంది. కొత్తగా కొన్ని పార్టీలు తెరమీదకు వస్తే.. మరికొన్ని తెరమరుగయ్యాయి. 2009 ఎన్నికల్లో 6 జాతీయ, 2 రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతోపాటు 51 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం ఉమ్మడి ఏపీలో 18 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. 16.72 శాతం ఓట్లు సాధించింది. కానీ, 2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం లేదు. అప్పటికే దానిని కాంగ్రె్‌సలో విలీనం చేశారు. అలాగే చిన్న పార్టీలకు పెద్దగా ప్రజాదరణ లభించలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలు జరిగాయి. టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడ్డాయి. పవన్‌ కల్యాణ్‌ జనసేనను ఏర్పాటు చేసినా పోటీకి దూరంగా ఉన్నారు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చారు.

ఈ ప్రధాన పక్షాలు సహా 2014లో 6 జాతీయ పార్టీలు, 2 రాష్ట్రస్థాయి పార్టీలతోపాటు 89 పార్టీలు బరిలో నిలిచాయి. 2009తో పోల్చుకుంటే పార్టీల సంఖ్య మరో 38 పెరిగినా.. అవి పెద్దగా ఓట్లను పొందలేదు. నవ్యాంధ్రలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు దారుణ పరాజయం చవిచూశారు. ఒక్కచోటా డిపాజిట్‌ రాలేదు. టీడీపీకి 102, మిత్రపక్షం బీజేపీకి 4, వైసీపీకి 67 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. ఇద్దరు స్వతంత్రులూ గెలుపొందారు. సీపీఎం, సీపీఐ ఖాతా తెరవలేదు. టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల శాతం తేడా కేవలం 0.03గా ఉంది. నలుగురు అభ్యర్థులు గెలుచుకున్న బీజేపీ కంటే.. ఒక్కరికీ డిపాజిట్‌ దక్కని కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రె్‌సకు బీజేపీకి పోలైన ఓట్ల కంటే 1,69,473 అధికంగా వచ్చాయి.

ఇక మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీకి, బీఎస్పీకి 2,08,957 చొప్పున ఓట్లు రావడం విశేషం. ఉభయ కమ్యూనిస్ట్‌ పార్టీలలో సీపీఐ కంటే సీపీఎంకే 0.09శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఆనాటి మిత్రులు ఇప్పుడు ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతుండటంతో ఎవరికెన్ని ఓట్లు వస్తాయన్నది ఆసక్తిగా మారింది.