Home News Politics

అనంతలో టగ్ ఆఫ్ వార్…!

SHARE

సీమలో అనంతపురం అర్బన్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ వైసీపీ, టీడీపీ హోరాహోరీ పోరాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బరిలో ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ జనసేన కూడా బలిజ సామాజికవర్గానికి చెందిన వరుణ్ పోటీలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ బలిజ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో జనసేన అభ్యర్థి ప్రభావం ఎవరిపైన ఉంటుందనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

అనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురునాధరెడ్డిపై దాదాపు తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన, బీజేపీ మద్దతు ఉండటంతో అనంతపురం అర్బన్ ప్రాంతంలో అన్ని కులాల మద్దతు ప్రభాకర్ చౌదరికి లభించింది. అయితే ఈసారి ప్రభాకర్ చౌదరికి టిక్కెట్ ఇవ్వకూడదని తొలినుంచి పార్టీలోనే అసంతృప్తులు పెరిగిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలసి మరీ విన్నపాలు చేసినా చివరకు ఆయనకే టిక్కెట్ దక్కింది. దీంతో అసంతృప్తులు ఆయన వైపు ఉంటారా? లేదా? అన్నది అనుమానమే.

ఇక మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి, ప్రభాకర్ చౌదరికి మధ్య కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో విభేదాలున్నాయి. ఈ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ వపన్ కుమార్ ఎంపీగా పోటీచేస్తున్నారు. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు. అయితే ఇటీవల చంద్రబాబు అనంతపురం పర్యటన సందర్భంగా ఈ నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్లు చెబుతున్నారు. మరి ఇద్దరూ ఎంతమేరకు ఒకరికొకరు సహకరించుకుంటారనేది చూడాల్సి ఉంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్న అనంత వెంకట్రామిరెడ్డి అనుభవమున్న నేత. అనంత వెంకట్రామిరెడ్డి తండ్రి వెంకటరెడ్డి అనంతపురానికి ఎమ్మెల్యేగా గతంలో ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో జేసీ సలహాతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గురునాధ రెడ్డి సయితం తిరిగి వైసీపీలోకి చేరి అనంత వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. మూడు సార్లు వరుసగా ఎంపీగావిజయంసాధించిన అనంత వెంకట్రామిరెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న లొసుగులే తనను గెలిపిస్తాాయన్ నమ్మకంతో అనంత వెంకట్రామిరెడ్డి ఉన్నారు. మరి జనసేన నుంచి బరిలో ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన వరుణ్ పైనే వీరి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయన్నది వాస్తవం.