Home News Stories

అనంతలో వాటర్ పాలిటిక్స్…!

SHARE

ఎన్నికలు సమీపించిన వేళ అనంతలో వాటర్ వార్ షురూ అయింది … కరువు ప్రాంత ప్రజల దృష్టిలో పడటానికి నీటి నినాదాలతో ఫీట్లు మొదలుపెడుతున్నారు నేతలు .. హంద్రీనీవా నీరు చిత్తూరు జిల్లాకి ఎలా తీసుకుపోతారు అంటూ… అనంతలో వైసీపీ ,టీడీపీ నేతల మధ్య జల జగడం ఒక రేంజ్లో జరుగుతోందిప్పుడు .. జిల్లా అవసరాలు తీర్చాకే .. చిత్తూరు జిల్లాకు తీసుకెళ్లాలంటూ వైసీపీ నేతలు జల దీక్షలు కూడా మొదలుపెట్టారు.. తామేమీ తక్కువ కాదన్నట్లు టిడిపి నేతలు సైతం కౌంటర్ ఇస్తూ ఎన్నికల వేళ హిట్ పెంచుతున్నారు…

రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన హంద్రీనీవా పథకం ఇప్పుడిప్పుడే ఫలాలనిస్తోంది… కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నీటి అవసరాలు తీర్చడానికి హంద్రీనీవా పథకాన్ని మొదలుపెట్టారు.. . ఇప్పటికే కర్నూలు అనంతపురం జిల్లాలకు హంద్రీనీవా నీరు అందుతోంది… అయితే చిత్తూరు జిల్లాకు కూడా ఈ నీరు తీసుకెళ్లాల్సి ఉంది…

దాంతో హంద్రీనీవా కాలువ పనుల్లో వేగం పెంచి ఇటీవలే చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు జిల్లాకు నీరు విడుదల చేశారు… అయితే సరిగ్గా ఇక్కడే వివాదం మొదలైంది… అనంతపురం జిల్లాలో ఒక ఎకరం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వకుండా చిత్తూరు జిల్లాకు నీరు ఎలా తీసుకెళ్తారు అంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు…

ఇటీవల కదిరి నియోజక వర్గానికి చెందిన వైసీపీ నేత సిద్ధారెడ్డి హంద్రీ-నీవా కాలువలో దిగి జల దీక్ష చేశారు… ఇటు పెనుగొండ నియోజకవర్గంలో కూడా వైసిపి నేత శంకర్ నారాయణ హంద్రీనీవా నీటి కోసం ఆందోళన చేపట్టారు… తీవ్ర కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు అన్యాయం చేస్తూ చిత్తూరు జిల్లాకు నీరు తీసుకెళ్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు… ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిస్థితి జిల్లా మొత్తంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది… ఆ క్రమంలో అప్రమత్తమైన టిడిపి నేతలు వైసిపి ప్రచారాన్ని తిప్పికొట్టడానికి రోడ్డెక్కుతున్నారు ..

చిత్తూరు జిల్లాకు నీటి మళ్లింపుపై తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని… అయితే ముందు అనంతపురం జిల్లాకు నీరు ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు … దీనిని తిప్పికొట్టేందుకు టిడిపి నేతలు నీటి లెక్కలు బయటకు తీసి తమ వాదనలు వినిపిస్తున్నారు .. తమ హయాంలో ఇంత నీరు ఇచ్చామని .. గతంలో ఏ రోజైనా నీరు వచ్చిందా అని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు…

అయితే జిల్లాలో చాలా చెరువుల్లో హంద్రీనీవా నీరు నింపినప్పటికీ.. సాగు అవసరాలకు సరిపడా ఇవ్వలేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు .. మరోవైపు రానున్నది వేసవి కావటంతో సాగు తాగునీరు కష్టాలు అధికమయ్యే అవకాశం కనిపిస్తోందంటున్నారు … ఎన్నికల వేళ రెండు పార్టీల నేతలు తమదైన లెక్కతో ఇలా జల జగడం ప్రారంభించడంతో.. అసలు వాస్తవాలు ఏంటి అన్నది ప్రజలకు అంతుచిక్కడం లేదు …. మొత్తమ్మీద రాజకీయ ప్రత్యర్ధులు నీటి అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఎంచుకోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.