Home News Politics

టీడీపీ కంచుకోట బద్దలవుతుందా…!

SHARE

విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో పోరు రసవత్తరంగా మారుతుంది. సిట్టింగ్ ను కాపాడుకోవాలని టీడీపీ ,ఈ సారైనా సీటు దక్కించుకోవాలని వైసీపీ హోరా హోరీగా పోటీకి సిద్ధమవుతున్నాయి. సామాజిక, ఆర్ధిక సమీకరణాలకు పెద్ద పీట వేస్తూ ఇరు పార్టీలు వ్యూహలు పన్నుతున్నాయి.కంచుకోటలో టీడీపీ మళ్ళీ పాగా వేస్తుందా లేక కొత్త ముఖంతో బరిలో దిగిన వైసీపీ పట్టు సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.అనకాపల్లి పై తమ పార్టీ జెండాను ఎగురవేయడానికి రెండు పార్టీలు తహతహలాడుతున్నాయి.

విశాఖ జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ రాజకీయాలు ప్రత్యేకం. అనకాపల్లి, పెందుర్తి, చోడవరం,మాడుగుల, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ స్థానాలు కలిగిన ఈ పార్లమెంట్ సీటును గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. సుమారు 47 వేల ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్ధి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలుపొందారు. అయితే ఆయన నెల రోజుల క్రితం వైసిపిలో చేరి భీమిలీ అసెంబ్లీ నుంచి బరిలో దిగారు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే మాడుగుల మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది. ఈ నేపధ్యంలో ఈ సీటును కాపాడుకోవడానికి టీడీపీ, ఈ సారి ఎలగైన దక్కించుకోవాలని వైసీపీ పోటీపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్ధిక, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు బలమైన అభ్యర్ధులను బరిలో దించాయి.

టీడీపీ నుండి విశాఖ డైరీ చైర్మెన్ అడారి తులసీరావు కుమారుడు అడారి ఆనంద్ బరిలో దిగగా, వైసీపీ నుండి కాండ్రేగుల సత్యవతి పోటీపడుతున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి ( గవర ) చెందడంతో మిగిలిన సామాజిక వర్గ ఓట్లు, ఆర్ధిక బలాలపైనే విజయావశాలు ఉంటాయని అంచానా వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇరుపార్టీల అభ్యర్ధుల బలాబలాపై చివరి నిమిషం వరకు అధిష్టానాలు సర్వేచేయించినట్లు సమాచారం. వైసీపీ ఖాతాలో ఉన్న మాడుగుల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించడం ద్వారా మరోసారి అనకాపల్లి పార్లమెంట్ సీటును కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడ్ని మాడుగుల అసెంబ్లీ నుండి దించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాడి రైతులతో అనుబంధం ఉన్న విశాఖ డైరీ చైర్మెన్ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్ ను పోటీకు దించడంతో మరిన్ని ఓట్లు కొల్లగొట్టవచ్చని టిడిపి భావిస్తోంది.

ఇక వైసీపీ విషయానికి వస్తే ఎన్నికలముందే పార్టీలో చేరిన సత్యవతిని బరిలో దింపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని కనీసం ఐదు అసెంబ్లీ స్థానాలైనా కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్దం చేసింది. చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాలం కలిసి వస్తే యలమంచిలిలో కూడా ఫ్యాన్ ను తిప్పడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అనకాపల్లి అసెంబ్లీ నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్ నాధ్ ను బరిలో దించడం ద్వారా దానిని కూడా ఖాతా లో వేసుకోవాలని చూస్తుంది. ఒకవైపు అధినేతల సభలు ,ఇంకోవైపు తమ సుడిగాలి ప్రచారాలు తమ విజయానికి కారణమవుతాయని భావిస్తున్నారు. మరి చూడాలి అనకాపల్లి పార్లమెంట్ సీటుపై ఎవరి జెండా ఎగురుతుంది, ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి, ఎవరి ప్రతివ్యూహాలు బెడిసి కొడతాయనేది.