Home News Stories

అమ్మో పెట్రోల్, డీజిల్ రేట్లు ఏందిరా సామి ఇది..?

SHARE

పెట్రోల్ 89, డిజీల్ 80 రూపాయలు. పెట్రోల్ తో డిజీల్ పోటీపడుతుంటే పెట్రోల్ వందకు రీచ్ అవుతుంది. డీజిల్ పెట్రోల్ రేట్ల పరుగు ఎటు వైపు అసలు ఈ విచ్చలవిడి పెరుగుదలకి కారణం ఏంటీ…రూపాయి బక్కచిక్కింది. డాలర్ తో పోలిస్తే దాని విలువ పాతాళానికి పతనమైంది. దీనికి తోడు ఆకాశమే హద్దన్నట్లుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరగడం. చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకం.. పెట్రో మంటకు కారణమవుతోంది. రూపాయి పతనం ఆ అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అయితే లీటర్ పెట్రోల్ ధర ఏకంగా ఎనభై తొమ్మిదన్నర రూపాయలకు పెరిగిందంటే చమురు మంటలు పుట్టిస్తున్న సెగ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

గతేడాది జూన్‌ నుంచి అమలు చేస్తున్న పెట్రో ధరల సమీక్ష విధానం సామాన్యుడికి గుదిబండగా మారింది. ఏడాదిన్నరకాలంలో పెట్రోల్‌ ధరలు అడ్డూ అదుపులేకుండా పెరిగిపోతున్నాయి. అయినా ఈ విషయంలో కేంద్రం కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఆయిల్‌ కంపెనీలు రోజుకో పైసా, పది పైసలు ఎక్కువలో ఎక్కువ 20 -30 పైసల చొప్పున పెంచుతూ పోతున్నాయి. ఇలా రోజుకు కొంత మొత్తం చొప్పున పెంచుతూ వినియోగదారులకు తెలియకుండానే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని 10 రెట్లు పెంచేశాయి. పెట్రో ధరలను ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ ధరలతో అనుసంధానం చేసిన తొలినాళ్లలో రోజువారీ సమీక్షలో ఆయిల్‌ కంపెనీలు లీటర్‌ పై చారాణా నుంచి అఠాణా వరకు త్గగించాయి. జనం ఈ విధానానికి అలవాటుపడ్డాక ఆయిల్‌ కంపెనీలు అసలు కథ మొదలుపెట్టాయి. జిమ్మిక్కులు ప్రదర్శిస్తూ జనం చేతి చమురు వదిలిస్తున్నాయి.

ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో పతనమైన క్రూడాయిల్‌ ధరలు.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఆకాశానికి ఎగబాకుతున్నాయి. సౌదీలో నెలకొన్న పరిస్థితులు, క్రూడాయిల్‌ ఉత్పత్తి విషయంలో ఒపెక్‌ దేశాల నిర్ణయం చమురు సెగను మరింత పెంచుతోంది. ఇప్పటికే ఎనిమిది పదులు దాటిన లీటర్ పెట్రోల్ ధర భవిష్యత్తులో పొంచి ఉన్న పెట్రో ధరల ముప్పును కళ్లకు కడుతోంది. గతంలో రెండేళ్ల పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం ఆయిల్‌ కంపెనీలకు వరంగా మారింది. ఆ సమయంలో వాటికి లక్షల కోట్ల ఆదాయం సమకూరింది.

క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ఒక్క డాలర్‌ పెరిగితే భారత దిగుమతులు వ్యయం 133కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే ఆర్థిక లోటు మరింత పెరుగుతుంది. ఫలితంగా కరెంట్‌ ఖాతా లోటుతో సతమతమయ్యే భారత్‌కు ఇది పెనుభారంగా మారనుంది. అంతేకాదు సామాన్యుడిపైనా ఇదే భారీ ప్రభావమే చూపుతుంది. పెట్రో ధరలు పెరిగితే రవాణా వ్యయాలు, ముడి పదార్థాల ధరలు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటాయి. పరోక్షంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లపైనా క్రూడాయిల్‌ ధరలు ప్రభావం చూపి రేట్లు తగ్గకుండా నిరోధిస్తాయి.

పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రైతులతో పాటు అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు ఇది పెనుభారంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో నిత్యావసర ధరల వస్తువులు పెరిగే అవకాశముంది. ఇంధనం ధరల పెంపుతో వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, కోత మిషన్లు, ఇతరత్రా పరికరాలకయ్యే ఖర్చు పెరగనుంది. ఇది ప్రతి ఎకరా పంట ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా పెంచుతుంది. రైతులతో పాటు ఆయా సరుకులను మార్కెట్ కి తరలించే లారీలు, ఇతర వాహనాలకు కూడా డీజిల్ వ్యయం భారీగా పెరగనుంది. ఇది నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం 80 డాలర్లుకు దరిదాపులో ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర భవిష్యత్తులో 100 డాలర్లకు పెరిగితే పరిస్థితి ఏంటని జనం భయపడుతున్నారు. ఇదే జరిగితే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలు దాటేస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది.