Home News Politics

కొరివితో త‌ల‌గోక్కుంటున్నారా?

అధినేత ఆగ్ర‌హం..త‌మ్ముళ్ల అత్యుత్సాహం..

SHARE

ధ‌ర్మాగ్రహ‌మ‌ని ప‌చ్చ‌కండువా నేత‌లు స‌మ‌ర్ధించుకోవ‌చ్చుగాక‌. పొరుగురాష్ట్రంలో ప‌నీపాటాలేని వీహెచ్‌లాంటి నాయ‌కుడు మంచి ప‌నిచేశార‌ని ప్ర‌శంసించొచ్చుగాక‌..అలిపిరి స‌మీపంలో అమిత్‌షా కాన్వాయ్‌పై దాడికి ప్ర‌య‌త్నించి కొరివితో త‌ల‌గోక్కుంది టీడీపీ. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీని ఓ చూపు చూడాల‌నుకుంటున్న కేంద్ర పెద్ద‌ల‌కు ఈ సంఘ‌ట‌న క‌లిసొచ్చింది. అమిత్‌షా కాన్వాయ్‌కి అడ్డుప‌డితే, నాలుగు చెప్పులు విసిరితే కేంద్ర దిగొస్తుంద‌నీ, హోదా ఇచ్చేస్తుంద‌నీ అనుకున్నారా? త‌మ క‌డుపులోని మంట బ‌య‌ట‌పెట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ అధ్య‌క్షుడి ప‌ర్య‌ట‌న‌లో నిర‌స‌న తెల‌పాల‌నుకునే ప‌ద్ధ‌తిదేనా?
తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్‌షాపై టీడీపీ శ్రేణుల నిర‌స‌న ప‌ర్వాన్ని బీజేపీ సీరియ‌స్‌గా తీసుకుంది. జాతీయ అధ్య‌క్షుడికే ర‌క్ష‌ణ లేక‌పోతే ఇక మా ప‌రిస్థితేంట‌ని కొంద‌రు నేత‌లు ప్ర‌శ్నిస్తే..మాజీ మంత్రి మాణిక్యాల‌రావు ఏకంగా శాంతిభ‌ద్ర‌త‌లు చేజారిపోయినందున రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టేయాల‌ని డిమాండ్‌కూడా చేసేశారు. ఆయ‌న‌డ‌గ్గానే పెట్టేస్తార‌ని కాదుగానీ..అస‌లే చంద్ర‌బాబు ప‌రిస్థితి అరిటాకులా ఉన్న స‌మ‌యంలో కొంద‌రు అత్యుత్సాహంతో తీసుకెళ్లి ముళ్ల‌మీద ప‌డేస్తున్నార‌నే. మే 15 త‌ర్వాత ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని ఓ ప‌క్క నిద్ర‌లో కూడా క‌ల‌వ‌రిస్తున్న చంద్ర‌బాబు.. .అలిపిరి సంఘ‌ట‌న‌తో ఉలిక్కిప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న‌పై సీరియ‌స్ అయ్యారు. అక్క‌డ దూకుడు ప్ర‌ద‌ర్శించింది ఒక‌రిద్ద‌రే అయినా టీడీపీ నిర్వాకంగానే ఎస్టాబ్లిష్ అయ్యింది.
ధ‌ర్మ‌పోరాట దీక్ష త‌ర్వాత వెంక‌న్న‌సాక్షిగా తిరుప‌తిలో మీటింగ్ పెట్టి కేంద్రంపై చంద్ర‌బాబు నిప్పులు చెరిగాక‌..చేతులు క‌ట్టుకుని కూర్చోటానికి త‌మ్ముళ్లేమ‌యినా చేవ‌లేనివాళ్లా? అందుకే కొడితే ఏనుగు కుంభ‌స్థ‌లాన్నే కొట్టాల‌న్న‌ట్లు ఏకంగా అమిత్‌షానే టార్గెట్ చేసుకున్నారు. అస‌లే ఆవేశంతో ఊగిపోతున్న బీజేపీకి మ‌రో ఆయుధం అందించామ‌నే ఆందోళ‌న‌తో చంద్ర‌బాబు డ్యామేజ్ కంట్రోల్ ప్ర‌య‌త్నాల్లో ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న‌లో పార్టీ నేత‌లుంటే వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు తిరుప‌తి త‌మ్ముళ్లేమో బీజేపీ నేత‌లే త‌మ‌పై దాడిచేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదులు చేశారు. అమిత్‌షా కాన్వాయ్‌లోని కొంద‌రు దాడికి దిగ‌డంవ‌ల్లే ఈ ర‌గ‌డ జ‌రిగిందంటూ..సీసీ ఫుటేజీ బ‌య‌టికి తియ్య‌మంటున్నారు. అడుసు తొక్క‌నేల‌. కాలు క‌డ‌గ‌నేల‌? అధినేత బీపీని పెంచ‌నేల‌?