Home News Politics

ఆసక్తిరేపుతున్న అద్దంకి రాజకీయం…!

SHARE

ప్రకాశం జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు వేదికగా నిలిచే నియోజకవర్గం అద్దంకి. ప్రకాశం జిల్లాలో ఉన్నా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం నుంచి రాజకీయ ఉద్ధండులు అయిన దాసరి ప్రకాశం, కరణం బలరాం, బాచిన చెంచు గరటయ్య, తాజాగా గొట్టిపాటి రవికుమార్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. జిల్లాలో ఉన్న మిగిలిన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల కంటే అద్దంకి రాజకీయం ఆసక్తికరం. ఇక్కడ ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోరు జరుగుతుంది అనడం కన్నా టీడీపీ వర్సెస్‌ టీడీపీ మధ్యే ఆసక్తికర ఫైట్‌ జరుగుతుంది. ఎమ్మెల్సీ కరణం బలరాం వచ్చే ఎన్నికల్లో నిర్వహించబోయే పాత్ర ఏమిటి? ఆయన కానీ, ఆయన కుమారుడు కానీ పోటీచేసే అవకాశం ఉంటుందా? అందుకు పార్టీ అవకాశం ఇస్తుందా? లేక ఇతర పార్టీలోకి వెళ్తారా? ఇవన్నీ ప్రస్తుతం జిల్లావాసుల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు….


గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య రాయలసీమ తరహా ఫ్యాక్షన్ ఎలా మొదలైంది. గతంలోను ఒకే పార్టీలో ఉన్న ఈ వర్గాలు, తమ వర్గపోరాటాన్ని అలా కొనసాగించుకోవడానికి కారణం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు మధ్య వర్గపోరాటం ఫ్యాక్షన్ స్థాయికి చేరడానికి కారణం రాజకీయాలే. కరణం బలరాం చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయ అరంగేట్రం చేశారు. 1978లో కాంగ్రెస్ తరుపున అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో చంద్రబాబుతో పాటు కరణం బలరాం టీడీపీలో చేరారు. 1985లో జరిగిన ఎన్నికల్లో బలరాంకు టీడీపీ తరుపున మార్టూరు టికెట్ కేటాయించారు. టీడీపీ తరుపున గొట్టిపాటి హనుమంతరావు జడ్పీ చెర్మన్‌గా ఉండేవారు. కరణంను టీడీపీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించిన గొట్టిపాటి పార్టీ టికెట్ కూడా కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవికి, టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. బలరాంకు టీడీపీ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడమే రక్తచరిత్రకు బీజం పడేలా చేసింది. అప్పటి నుంచి మార్టూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వర్గాలు తయారయ్యాయి. ఇద్దరు నేతల అనుచరులు ఆయా గ్రామాల్లో బలోపేతం కావడంతో తరచూ ఘర్షణలు చోటుచేసుకునేవి. ఇవి ఒక్కోసారి దాడుల వరకు వెళ్లేవి.

1989 అసెంబ్లీ ఎన్నికల్లో కరణం టీడీపీ తరపున హనుమంతరావు కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బలరాం విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో పరిస్ధితి విషమించింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు, బాంబు దాడులు, హత్యలు ఎక్కువయ్యాయి. రాజకీయ ఘర్షణలు ఫ్యాక్షన్ తగదాల వరకు వెళ్లడంతో సర్దుబాటు చేసేందుకు అప్పుడు రాజకీయ నేతలు ప్రయత్నించలేదు. అయితే ఈ ఫ్యాక్షన్ రక్త చరిత్రను మరో రేంజ్‌కు తీసుకెళ్లిన ఘటన 1992లో చోటుచేసుకుంది. గొట్టిపాటి హనుమంతరావు తనయుడు కిషోర్ సహా నలుగురిని దారుణంగా హత్య చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ హత్యకు కారణం అంటూ కరణం బలరాంతో పాటు అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. 1993లో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి హత్య కేసులో బలరాంకు కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పుపై కరణం హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. 1994లో కింది కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తర్వాత కరణం కాంగ్రెస్‌లో చేరారు.

అప్పటివరకు వర్గాల మధ్య ఉన్న ఘర్షణలు గొట్టిపాటి కిషోర్ హత్యతో నేతల మధ్యకు చేరాయి. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం పోటీ చేశారు. హనుమంతరావు టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే 1997లో హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. అదే ఏడాది బలరాం టీడీపీలో చేరారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గొట్టిపాటి నరసయ్యకు బలరాం మద్దతు ప్రకటించారు. దాంతో గొట్టిపాటి నరసయ్య మార్టూరులో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంతటితో కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ముగిసిపోయినట్లేనని అందరూ భావించారు.గొట్టిపాటి వర్గీయులకు మార్టూరు, కరణంకు అద్దంకి బాధ్యతలు అప్పగించేలా రాజీ చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ రాజకీయం మళ్లీ రక్త చరిత్రను రగిలించేలా చేసింది. 2004 ఎన్నికల్లో మార్టూరు నుంచి పోటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య సమీప బంధువైన గొట్టిపాటి రవికుమార్‌ను కాంగ్రెస్ తరుపున పోటీకి నిలబెట్టారు వైయస్ రాజశేఖర్‌రెడ్డి మార్టూరు నుంచి రవి, అద్దంకి నుంచి కరణం గెలుపొందడంతో ఆగిపోయిందనుకున్న రక్త చరిత్రకు మళ్లీ బీజం పడినట్లయింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేసిన రాజకీయం కూడా ఈ ఫ్యాక్షన్ గొడవలు పెరిగిపోవడానికి కారణమైంది. మార్టూరు నియోజకవర్గాన్ని తీసేసి అద్దంకిలో కొంత భాగం, పర్చూరులో కొంత భాగం కలిపేయడంతో గొట్టిపాటి రవి అద్దంకి నుంచి తన అదృష్టాన్ని పరిక్షించుకోవాల్సి వచ్చింది. గత రెండు ఎన్నికల్లో అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓసారి బలరాం, ఓ సారి కరణం వెంకటేష్‌ పై గెలిచారు.

జిల్లాలో రాజకీయంగా కరణం బలరాంకు ప్రత్యేకస్థానం ఉంది. ముఖ్యంగా టీడీపీలో ఆయన ముద్ర బలమైంది. కారణాలు ఏమైనప్పటికీ గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను తప్పించి కుమారుడు వెంకటేష్‌కు అద్దంకి నుంచి పోటీచేసే అవకాశం ఇచ్చారు. వెంకటేష్‌పై పోటీ చేసి గెలుపొందిన రవికుమార్‌ను ఆ తర్వాత టీడీపీలో చేర్చుకునే సమయంలోనూ బలరాంకు ప్రాధాన్యం ఇచ్చేందుకు సీఎం ప్రయ త్నించారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యే రవికుమార్‌కు ముందుగానే చెప్పి బలరాంనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అదే సమయంలో చంద్రబాబు బలరాం కుమారుడు వెంకటేష్‌ను తన కొడుకులా చూసుకుంటానని చెప్పారు. పునర్విభజనలో కొత్త నియోజకవర్గాలు వస్తాయని ఒకచోట వెంకటేష్‌ పోటీకి అవకాశం ఇస్తానని బాబు చెప్పినట్లు ప్రచారం జరిగింది. కానీ, పునర్విభజన జరక్కపోవడంతో సమస్య ఎదురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీకి వెంకటేష్‌కు ఎక్కడ అవకాశం ఇవ్వాలన్నది ప్రశ్నార్థకమే. అద్దంకి నుంచే అవకాశం ఇవ్వాలని బలరాం, ఆయన కుమారుడు కోరుతున్నారు. కానీ, అద్దంకి విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తామని, భవిష్యత్‌లోనూ అద్దంకి టిక్కెట్‌ మీకేనన్న హామీని అధిష్ఠానం ఇచ్చి ఎమ్మెల్యే రవికుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారు.

తదనంతర పరిణామాల్లో తనదైన వ్యవహారశైలితో రవికుమార్‌ సీఎంకి మరింత చేరువయ్యారు. ఒకట్రెండు సందర్భాల్లో దూకుడుగా వ్యవహరించిన బలరాం విషయంలో సీఎం చంద్రబాబు అసంతృప్తికి గురయ్యారు. ఇదంతా జగమెరిగిన సత్యం. దీనికితోడు నియోజకవర్గంలో టీడీపీ పాత కాపులను కలుపుకొనిపోవడంలో రవికుమార్‌ అనుసరించిన విధానం పట్ల అటు సీఎంతోపాటు, అధిష్ఠానంలోని నాయకులంతా సంతృప్తితో ఉన్నారు. దీంతో అద్దంకి విషయంలో రవికుమార్‌కే బాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు బలరాంనకు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు ఉంది. ఆయనకు మంచి పరిచయాలు ఉన్న పర్చూరు, దర్శి నియోజకవర్గాలను తీసుకుంటే అక్కడా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. వారు పోటీకి సిద్ధమై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. దర్శి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శిద్దాను తానే రాజకీయాల్లోకి తెచ్చారు, ఆయనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని బలరాం పదేపదే చెప్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును తన శిష్యుడిగా ఆయన ప్రకటించుకున్నారు. దీంతో వారిద్దరిలో ఎవరినైనా తొలగించి తనకు కానీ, తన కుమారుడుకు కానీ టికెట్టు ఇవ్వాలని అడగలేని పరిస్థితి బలరాంకు ఎదురైంది.

టీడీపీ జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఆయన ఒంగోలులో నివాసం ఉండటం ప్రారంభించారు. ఒంగోలు ఎంపీగా కూడా గతంలో పనిచేశారు. అలాగని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్టు అడిగితే ప్రస్తుత ఎమ్మెల్యే జనార్దన్‌ను కాదని ఆయనకు అవకాశం ఇచ్చేందుకు బాబు సిద్ధపడే అవకాశమే కన్పించడం లేదు. చీరాలలో ఆమంచికి ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ, ద క్షిణ ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు బలరాంను పంపే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బలరాం లేక ఆయన కుమారుడికి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలంటే చంద్రబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత టీడీపీలోని వాతావరణం, చంద్రబాబు వ్యవహార శైలిని పరిశీలిస్తే బలరాం కానీ, ఆయన కుమారుడికి కానీ అసెంబ్లీ నుంచి పోటీకి అవకాశం లేకపోవచ్చని విశ్లేషకులు, టీడీపీలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించే నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇంకోవైపు బలరాంను, ఆయన కుమారుడిని ఎక్కడ అవసరమైతే అక్కడ వినియోగించుకోవాలన్న ఆలోచనలో టీడీపీ అధినేత ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకదశలో ఎమ్మెల్సీ మాగుంట పార్టీని వీడితే ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు మనకు బలరాం ఉన్నారులే అన్న ధీమాను అధిష్ఠానంలోని కొందరు నాయకులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతెందుకు అవసరమైతే చీరాలలో అయినా పోటీకి దించవచ్చన్న ఆలోచన కూడా చేసినట్లు చెప్తున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి, అధినేత చంద్రబాబు పూర్తిస్థాయిలో ఒక అవగాహనతో ఉన్నారు. అలాంటప్పుడు బలరాంను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై కూడా ప్రత్యేక ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒక దశలో ఎవరు పార్టీలో ఉన్నా, వెళ్లినా పర్వాలేదన్న విధంగా సీఎం వ్యవహరించిన మాట నిజం. కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు ఆయనలో అంత దూకుడు లేదు. బలరాం రాజకీయ వ్యవహార శైలిలోనూ చాలా మార్పు వచ్చింది. వద్దన్నా వినకుండా బల్లికురవ వెళ్లి హడావుడి చేసిన బలరాం నేడు సైలెంట్ గా మారి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు.

నిజానికి బలరాంకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉంది. ప్రస్తుతం వారు కూడా మొదటి ప్రాధాన్యంగా చీరాల నుంచి పోటీకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కాదూకూడదంటే అద్దంకి టికెట్టు అయినా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బలరాంనే పోటీ చేయించాలని కాదంటే ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. మరి సీఎం బలరాంను కలుపుకొని పోయేందుకు ఎలాంటి చొరవ చూపుతారు? బలరాం ఎంతమేరకు కలిసిపోతారు? అనేది వేచి చూడాల్సి ఉంది. అద్దంకి నియోజకవర్గంలో ఇంకా ఆయనతో మమేకమై ఉన్న కిందిస్థాయి నాయకులు బలరాంను కలిసి తాడోపేడో తేల్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ప్రత్యేకించి అద్దంకి మండలంలోని నాయకులు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అద్దంకి మండలంలో ఒకరిద్దరు గుర్తింపు పొందిన నాయకులు, బల్లికురవ మండలంలో మరికొందరు, సంత మాగులూరు మండలంలో రెండు, మూడు గ్రామాలకు చెందిన వారు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రవికు మార్‌తో కలవలేకపోయారు. కొరిశపాడు మండలంలోనూ మేదరమెట్ల, మరికొన్ని గ్రామాల్లో అలాంటి వారు లేకపోలేదు. వీరంతా మున్ముందు ఏం చేయాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.

భవిష్యత్‌లో బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌ సేవలను టీడీపీ అధిష్ఠానం ఎలా వినియోగించుకుంటుంది? చంద్రబాబు వ్యూహం ఫలించక బలరాం వైసీపీలోకి వెళ్తారా? ఉన్న అవకాశం మేరకు టీడీపీలోనే ఉండి సర్ధుకుపోతారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.