Home News Politics

సిక్కోలులో మంత్రుల ఎందురీత…?

SHARE

సిక్కోలులో ఇద్దరు మంత్రులు చెమటోడుస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ మెజారటీ ఎంత అనేది లెక్క వేసుకున్న మంత్రలు ఇప్పుడు గెలిస్తే చాలన్నట్లు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో సీన్ మారుతుందన్న సిగ్నల్స్ ఇద్దరు మంత్రులను భయపెడుతున్నాయి. ఫ్యాన్ గాలి ముందు ఏదైనా జరగొచ్చన్న బెంగతో ఇప్పుడు క్షణం తీరిక లేకుండా, నిన్న మొన్నటివరకూ పట్టించుకోని నేతలను సయితం వారి ఇళ్లకు వెళ్లి మరీ పలకరించి వస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులు అచ్చెన్నాయుడు.. కిమిడి కళా వెంకట్రావు. కళా వెంకట్రావు గత ఎన్నికల్లో ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు. గతఎన్నికల్లో కళా వెంకట్రావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ పై కేవలం 4741 ఓట్ల తేడాతో గెలిచారు. స్వల్ప తేడాతో గెలవడంతో తొలి మంత్రివర్గంలో కళాకు చోటు దక్కలేదంటారు. ఆయనకు దగ్గర బంధువైన కిమిడి మృణాళినికి చంద్రబాబు అవకాశమిచ్చారు. అయితే తర్వాత ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడం, మంత్రిగా ఎంపిక కావడం చకా చకా జరిగిపోయాయి.

అయితే ఎచ్చర్లలో ఇప్పడు గత ఎన్నికల్లో లాగానే అభ్యర్థులు ఉన్నారు. టీడీపీ తరుపున కళా వెంకట్రావు, వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ లు ఉన్నారు. జనసేన అభ్యర్థి జనార్థన్ కూడా ఇక్కడ గట్టిపోటీ ఇచ్చే అవకాశముందంటున్నారు. దీంతో కళాకుచెమటలు పడుతున్నాయి. గత ఎన్నికల్లోనే చచ్చీ చెడీ గెలిచిన కళాకు ఈసారి గెలుపు కష్టమేనంటున్నారు. గొర్ల కిరణ్ కుమార్ పై సానుభూతి ఉండటం, వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఆయనకు అనుకూలంగా మారిందంటున్నారు. ఇక జనసేన అభ్యర్థి జనార్థన్ పోటీ వల్ల కూడా కళాకు దెబ్బతగులుదందని చెబుతున్నారు.

టెక్కలి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. టీడీపీకి కంచుకోటగా భావించే టెక్కలి నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ తనదే గెలుపన్న ధీమాలో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన పై వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేస్తున్నారు. తిలక్ వల్ల పెద్దగా ముప్పు ఉండదని భావించిన అచ్చెన్న నింపాదిగా ఉన్నారు. కానీ కిల్లి కృపారాణి, వైసీపీ పార్లమెంటు అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ లు రంగంలోకి దిగడంతో మంత్రి బెంబేలెత్తుతున్నారు. కాళింగ సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో అచ్చెన్న ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మొత్తం మీద సిక్కోలులో ఇద్దరు మంత్రులు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.