Home News Politics

100 కోట్ల క్లబ్ లో చేరుతున్న ఆ నియోజకవర్గం…

SHARE

100 కోట్ల క్లబ్ లో సినిమాలు చేరడం గురుంచి మనం అడపాదడపా వింటుంటాం. కానీ ఎన్నికల వేళ 100 కోట్ల క్లబ్ లో చేరుతున్న నియోజకవర్గాల గురుంచి కూడా వినాల్సి వస్తుంది. కానీ ఒక్కటే తేడా… సినిమా అయితే డబ్బు వసూలు అవుతుంది. నియోజకవర్గాల్లో డబ్బు వదిలించుకోవాల్సి వస్తుంది. నిజానికి నాయకుడంటే కొన్ని లక్షణాలు ఉండాలి కానీ ఆ రోజులు పోయి లక్షలు ఉంటే చాలు అనే పరిస్థితి ఏర్పడింది. డబ్బులుంటే జల్సా చెయ్యొచ్చు,బిజినెస్ చేయొచ్చు మరి దురదెక్కువుంటే సినిమాలు నిర్మించొచ్చు కానీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయొచ్చా? జరుగుతున్నవి చూస్తుంటే అలాగే ఉంది.

డబ్బు ప్రలోభానికి జనం జైకొడుతుండటంతో కుబేరులు ఎన్నికల్లో పోటీచేసేందుకు క్యూ కడుతున్నారు. తాజా ముందస్తు ఎన్నికలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం 100 కోట్ల దాకా ఖర్చు చేసే ఆశావహులు సిద్ధంగా ఉన్న నియోజకవర్గంగా వార్తల్లోకెక్కింది. మాములుగా అయితే ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఎవరి స్థోమత వారిదే అనుకున్నా జిల్లాల పరిధిలో నియోజకవర్గానికి 15 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. మరి గ్రేటర్ ఈ పరిధిలోనైతే ఒక్కొక్కరు రూ. 25 కోట్ల దాకా ఖర్చు చేస్తారని చెబుతున్నారు. దీనికే మనం “హమ్మో అంతా!” అంటూ ఆశ్చర్యపోతాం కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలువురు టికెట్ కోసం పోటీపడుతూ దక్కితే పాతిక కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఖర్చు చేస్తామని బాహాటంగానే చేబుతున్నారట.

సంవత్సరాలుగా పార్టీకి సేవ చేయడమో,ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకోవడమో కాకుండా కుబేరులనే ఒక ఒక ప్రామాణికతో వీరిని ఎమ్మెల్యే పదవికి ప్రేరేపిస్తున్నాయని అంచనా. వారు తలుచుకుంటే ఇటు స్థానిక క్యాడర్ నైనా అటు అధిష్టానాన్నైనా ఒక్క సూటుకేసుతో కొనేయొచ్చన్న ధోరణితో వీరు ముందుకు వెళుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గం తరపున టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల వివరాల్లోకి వెళితే… టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ వందల కోట్లకు అధిపతి! రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్ గా,ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీ అధినేతగా ఉన్నారు. ఈయన గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి అనంతరం గులాబీ కండువా కప్పుకున్నారు. అలాగే కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎం. బిక్షపతి యాదవ్ … ఈయన కూడా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించడంతో కోట్లకు అధిపతి అయ్యారు. 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో అదే పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ ఇప్పటికే నియోజకవర్గంలో దండిగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్న వెనిగళ్ల ఆనందప్రసాద్ భవ్య క్రియేషన్స్,భవ్య సిమెంట్ భవ్య రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వేల కోట్లకు పడగలెత్తారు. బీజేపీ తరపున ప్రయత్నాలు సాగిస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్ మైన్స్,ఫైనాన్స్ వ్యాపారాలతో మిలియనీర్ గా ఉన్నారు.

గెలిచాక నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడంలో కాకుండా గెలవడానికి సొంత నిధులు ఖర్చు పెట్టుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఈ కుబేరుల్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి