Home News

విజయసాయిరెడ్డికి పదవి ఇచ్చి ఎందుకు పీకేశారు…!

SHARE

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిని నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. మళ్ళీ అంతలోనే ఆఘమేఘాల మీద రద్దు చేసింది….అసలు ఈ తతంగం వెనుక ఏం జరిగింది…ఈ జీవో రద్దు వెనుక ఉన్న మిస్టరీ ఏంటి…? అలా చేయకపోతే వైసీపీకి పెద్ద షాక్ నిజంగానే తగిలేదా?

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద రద్దు చేసింది. ఇటీవలే ఆయన్ని ఈ పదవిలో నియమించారు. అయితే ఎంపీలుగా ఉన్నవాళ్లు లాభదాయక పదవులలో ఉండకూడదన్న నిబంధన ఉంది. ఎంపీలు లాభదాయక పదవుల్లో ఉంటే, వారి పార్లమెంటు సభ్యత్వంపైనే అనర్హత వేటుపడే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ నియామకాన్ని రద్దు చేసింది.

తెలంగాణలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా క్యాబినేట్ ర్యాంకుతో అలాంటి పదవులే ఇస్తే హైకోర్టు అక్షింతలు వేసింది. ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఆ పదవి ఇవ్వటం, మరల రద్దు చేయటం అనేది ముందూ వెనుక చూసుకోకుండా జగన్ సర్కార్ తీసుకున్న తొందరపాటు నిర్ణయంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి…లాభాపేక్ష కలిగిన పదవిలో 13 రోజులు కొనసాగినందుకు విజయ సాయిరెడ్డిని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించి ఆయనపై వేటు వేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 102 (1)ఏ ప్రకారం ఆయనను ఎంపీ పదవికి అనర్హుడిగా ఈసీ తక్షణం ప్రకటించాలన్నారు.

ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేయడానికి ఈ పదవిని పొందిన విజయ సాయిరెడ్డి చట్టానికి దొరికిపోయి దాని నుంచి తప్పించుకొనేందుకు జీవోను రద్దు చేయించుకొన్నారంటున్నారు టీడీపీ నేతలు. అటు ముగ్గురు ఎంపీలను మంత్రివర్గ ఉప సంఘంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం పై కూడా టీడీపీ ఫైరవుతుంది. ఎంపీలను మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యులుగా నియమించిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు.

ఒకవైపు రివర్స్‌ టెండరింగ్‌ అంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడటం, మరోవైపు కంట్రాక్టర్లను బెదిరించడం, ఇంకోవైపు వసూల్‌ రాజాలను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంతో సీఎం జగన్‌ అవినీతి లోగుట్టు ప్రపంచానికి అంతా తెలుస్తోంది’ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.