Home News Politics

ఫ్యాక్షన్ గడ్డ పై మళ్ళీ పాత కాపులే పోటీ….

SHARE

పాత కాపులే మళ్ళీ ప్రత్యర్ధులుగా తలపడే పరిస్థితి కనిపిస్తోందక్కడ .. ప్రస్తుతం ఇద్దరు అధికారపక్షం గూటి కిందే ఉన్నా.. చిరకాల వైరం పోటీకి ఉసికొల్పుతుందని అంటున్నారు.. ప్రత్యర్ధి పార్టీ ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం .. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నీడలో తల్లడిల్లుతున్న ఆ సెగ్మెంట్ కొంతకాలంగా సేదతీరుతోంది.. అయితే ప్రస్తుత పరిణామాలతో పాత చరిత్రే పునరావృతం అయ్యే పరిస్థితి ఉందంటున్నారు

బాంబుల మడుగు అదేనండి జమ్మల మడుగు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలీని వారుండరేమో.. ఇక్కడి గత చరిత్ర సమస్తం బాంబులు హత్యల మయమే .. రెండు కుటుంబాల మధ్య సాగిన ఆధిపత్య పోరే… కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అంటే గుర్తుకొచ్చేది ఇవే… అయితే కాలక్రమేణా పరిస్థితులు మారాయి… గొడవలు సద్దు మణిగాయి… బాంబు పేలుళ్లు వినిపించడం మానేశాయి … వేట కొడవళ్ళు పదును కోల్పోయి మూలన పడ్డాయి… అంతా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది…

రెండు ఫ్యాక్షన్‌ కుటుంబాల ప్రస్తుత పెద్దలుగా ఉన్న వేర్వేరు కత్తులు ఇప్పుడే ఒకే ఒరలో ఇమిడిపోయాయి. .. నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు… అలా ఫ్యాక్షన్‌ గొడవల నుంచి ప్రశాంతత వైపు అడుగులు వేస్తోంది జమ్మలమడుగు… ఇక అంతా ప్రశాంతమే అనుకుంటున్న సమయంలో ఎన్నికల సీజన్‌ మళ్లీ పాత చరిత్ర పునరావృతం చేస్తుందేమో అన్న భయం వెంటాడుతోంది నియోజకవర్గ వాసుల్ని.. ఆ కుటుంబాల వారే మళ్ళీ పోటీలో ఉంటారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. దశాబ్దాలుగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రస్తుత మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబాల మధ్య తీవ్రమైన రాజకీయవైరం, ఫ్యాక్షన్‌ గొడవలు ఉన్నాయి.. ఈ రెండు కుటుంబాల నుంచి తప్పితే ప్రధాన పార్టీలకు అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదంటే జమ్మలమడుగులో వారి ఆధిపత్యం అర్ధం చేసుకోవచ్చు…

అయితే మారిన సమీకరణాల పుణ్యమా అని ఇద్దరు నేతలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు… మంత్రిగా ఆదినారాయణరెడ్డి.. శాసనమండలి విప్ గా రామసుబ్బారెడ్డి అధికారపక్షంలో కొనసాగుతున్నారు .. టీడీపీ అధిష్టానం చొరవతో ఆ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కుటుంబవైరాలు అంతర్గతంగా అలాగే ఉన్నాయన్న టాక్‌ ఉంది… అందుకే ఇద్దరు నేతలు ఆంటీముట్టనట్టు వ్యవహరిస్తుంటారు.. వైసిపి టికెట్‌తో జమ్మలమడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి అవ్వడం.. గత ఎన్నికల్లో పరాజయం పాలైన బాంబుల శివారెడ్డి రాజకీయ వారసుడు రామసుబ్బారెడ్డిని టీడీపీ ఎమ్మెల్సీని చేసి విప్‌గా సముచిత గౌరవివ్వడంతో ప్రధానప్రతిపక్షం వైసిపికి స్థానికంగా నాయకత్వం కొరవడినట్లైంది…

చిరకాల ప్రత్యర్ధులు ఇద్దరు ఇప్పుడు టీడీపీ లో కొనసాగుతుండటంతో.. నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా మాజీమంత్రి మైసూరా సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి బాధ్యతలను నిర్వహిస్తున్నారు… అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జమ్మలమడుగులో పరిస్థితులు తారుమారు అవుతున్నట్లు కనిపిస్తున్నాయి.. ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తూ సుధీర్ రెడ్డి వైసీపీ బాధ్యతలను నెట్టుకొస్తున్నారు… అయితే ఆ పార్టీ అధినేత జగన్ ప్రస్తుత మంత్రి ఆదినారాయణరెడ్డిని ఢీ కొట్టడానికి సుధీర్ రెడ్డి సరిపోరని భావిస్తున్నారంట ..

జమ్మలమడుగులో తాను నెట్టుకురాలేనని వైసిపి ఇన్‌ఛార్జ్ సుధీర్ రెడ్డి కి కూడా స్పష్టంగా తెలుసని పార్టీ వర్గాలే అంటున్నాయి ..అందుకే ఏమో సదరు సుధీర్ రెడ్డి ఇటీవల కొంత మంది పార్టీ అనుయాయులతో వైసీపీ టిక్కెట్టు రామసుబ్బారెడ్డికే అని చెప్పినట్టు సమాచారం… అందుకు సంబంధించి ఆడియో కూడా బయటకు వచ్చి హల్చల్ చేస్తోంది…

వైసిపిలో జరుగుతున్న వ్యవహారాలపై సుధీర్‌రెడ్డి ఒకరిద్దరు గ్రామ స్థాయి నేతల ముందు తన గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం.. సుధీర్ రెడ్డి మాటలు, పోకడలు బట్టి పరిశీలిస్తే వైసీపీ టిక్కెట్టు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డికే ఖాయమనిపిస్తోందంటున్నారు… వైసిపి పెద్దలు కూడా ఆ దిశలో ప్రయత్నాలు మొదలు పెట్టారన్న టాక్‌ ఉంది.. వాస్తవంగా ఆదినారాయణ రెడ్డి వంటి బలమైన నేతకి పోటీ ఇచ్చే సత్తా రామసుబ్బారెడ్డి కుటుంబానికి మాత్రమే ఉంది… ఒకవేళ టీడీపీ అధినేత ఎన్నికల నాటికి ఆదినారాయణ రెడ్డి ని కడప పార్లమెంటు అభ్యర్థిగా పంపాలనుకున్నా మంత్రి అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చంటున్నారు …

అలాగని ఎలాంటి పోటీ లేకుండా గమ్మున ఉండి ఆదికి సపోర్టు చేయమని రామసుబ్బారెడ్డికి చెప్పినా ఆయన వినే పరిస్థితి ఉండదంటున్నారు .. ఆ క్రమంలో జగన్ వచ్చే ఎన్నికల నాటికి జమ్మలమడుగు వైసిపి క్యాండెట్‌ రామసుబ్బారెడ్డి అని నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది .. మరి ఆయన మనస్సులో ఏముందో? రామసుబ్బారెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో? కాని సుధీర్‌రెడ్డి మాత్రం వైసీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి అంటూ పలువురు వైసీపీ నేతల దగ్గర చెపుతుండటం జమ్మలమడుగులో చర్చనీయాంశంగా మారింది .. చూడాలి మరి ఎన్నికల నాటికి ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంటుందో  ?