Home News Politics

టీడీపీ ముద్దు…ఎమ్మెల్యే అనిత వద్దు..!

SHARE

ఎన్నికల వేళ విశాఖజిల్లాలో టిడిపికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి … అధికార పార్టీ ఎమ్మెల్యే పై స్థానిక నేతలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు.. సిట్టింగ్‌కు తిరిగి టిక్కెట్ ఇస్తే భారీ తేడాతో ఓడిస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు… అసలా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై పార్టీ శ్రేణులు ఎందుకు ఆ రేంజ్‌లో విరుచుకుపడుతున్నాయి. విశాఖజిల్లాలో ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడుతోంది … ఐదేళ్ళు ఎమ్మెల్యే వ్యవహారతీరును భరించిన తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు… ద్వితీయశ్రేణి నాయకత్వంలో గూడుకట్టుకున్న అసంతృప్తి … ఎన్నకల వేళ బహిర్గతమౌతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో అయితే ఈ వేడి మరింత ఎక్కువైంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలతో పాయకరావుపేటలో వాతావరణం హాట్ హాట్ గా మారుతోంది… “ఎమ్మెల్యే అనిత మాకొద్దు-టీడీపీనే ముద్దు” అంటూ అసమ్మతి నాయకులు రోడ్డెక్కుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన పాయకరావుపేట తెలుగుదేశంపార్టీకి కంచుకోట … టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువ సార్లు ఆ పార్టీ అభ్యర్ధులే గెలుపొందారు… 2014 సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరారు వంగలపూడి అనిత. తొలి ప్రయత్నంలోనే సుమారు 2500 ఓట్లతో పాయకరావు శాసనసభ్యురాలిగా గెలుపొందారు. టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన అనిత…..జనసేన మద్దతుతో విజయం సాధించారు… తెలుగుదేశంపార్టీ సిద్ధాంతాలు నచ్చడం, రాష్ట్రవిభజన తర్వాత చంద్రబాబు నాయకత్వమే కీలకమని భావించిన కొందరు సీనియర్ నేతలు పార్టీలోకి వచ్చా రు… నియోజకవర్గంలో అనిత నాయకత్వం కొత్తే అయినా సమిష్టి కృషి ఫలితంగా ఆ ఎన్నికల్లో టిడిపి విజయం సాధ్యమైంది…

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలం ఎమ్మెల్యే అనిత .. సీనియర్ నాయకుల మధ్య సయోధ్య కొనసాగింది… మొదట్లో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలకే ఆమె అధిక ప్రాధాన్యత ఇచ్చారు… తర్వాత కాలంలో నియోజకవర్గంపై పట్టు సాధించడం సంగతి పక్కనపెడితే … తన మార్క్ పరిపాలన కోసం ఎమ్మెల్యే అనిత చేసిన ప్రయత్నాలు సీనియర్లలో అసంతృప్తిని రాజేశాయనే వాదన చాలా కాలంగా వుంది… పార్టీ ప్రయోజనాల ఆశించి కష్టపడుతున్న తమను పక్కన బెట్టిన ఎమ్మెల్యే కోటరీని నమ్ముకున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వున్నాయి… అయితే ఇంతకాలం ఇంటిగుట్టు బయటకు రాకుండా వ్యవహరించిన సీనియర్లు… ఎన్నికల వేళ అసంతృప్తితో రగిలిపోతున్నారు… ఎమ్మెల్యే అనితకు కొందరు మండల స్ధాయి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు వేడిని పుట్టిస్తున్నాయి…

సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదన్న అసంతృప్తి తో వున్న కొందరు నాయకులు… ఎమ్మెల్యేతో గ్యాప్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్నారు .. కొద్దిమంది అభిప్రాయాలకు ఆమె విలువ ఇవ్వడం…. వారు చెప్పిన పనులు మాత్రమే జరుగుతుండటంతో ఈ గ్యాప్ మరింత పెరిగిపోయింది… ఇటీవల నియోజ కవర్గంలో ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న వివాదం….అగ్నికి ఆజ్యం పోసిందనే చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అంతా ఒక్కతాటిపై కి వస్తోంది. పరాభవానికి గురైన నాయకులంతా ఎమ్మెల్యేను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించుకుంటున్నారు… ఈమేరకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు… ఆ క్రమంలో పాయకరావుపేట టీడీపీ టిక్కెట్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతున్నారు… మరోవైపు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ కుటుంబం ఇక్కడ టిక్కెట్ తమకే లభిస్తుందనే అభిప్రాయంతో వుంది. ఇప్పటికే చెంగల కుమార్తె విజయలక్ష్మి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు…

ఈ తరుణంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ తోటనగేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు … మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో ఎమ్మెల్యే అనిత వైఖరిని బాహటంగానే విమర్శిస్తున్నారు… అంతే కాకుండా ఈ దఫా ఆమెకు టిక్కెట్ ఇస్తే 34 వేల ఓట్ల తేడాతో ఓడిస్తామని ప్రకటిస్తున్నా రు. పాయకరావుపేట, కోటవురట్ల మండలాల్లో నిర్వహించిన సభల్లో ఎమ్మెల్యేపై అసంతృప్తిని బాహటంగానే వెల్లగక్కారు నేతలు. టీడీపీ ముద్దు ..ఎమ్మెల్యే అనిత వద్దు … పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను కూడగడుతున్నారు.

సీనియర్ నాయకులకు గౌరవం ఇవ్వడం లేదని విమర్శిస్తున్న అసమ్మతి నేతలు …. ఎమ్మెల్యేపై అవినీతి, అక్రమాల ఆరోపణలు గుప్పిస్తున్నాయి… ఆమె వైఖరి కారణంగా సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందడం లేదని అక్కసు వెల్లగక్కుతున్నారు… మళ్ళీ అనితకే టిక్కెట్ ఇస్తే 34 వేల ఓట్ల తేడాతో ఓడిపోతారని….ఆ ప్రభావం అనకాపల్లి పార్లమెంట్ సీటుపైనా పడుతుందని హెచ్చిరస్తున్నారు .. మరోవైపు, ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నా రు ఎమ్మెల్యే అనిత… అసమ్మతి కుటుంబ వ్యవహారం అని కవర్‌ చేసుకుంటూ .. పరిస్ధితి చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు… మొత్తమ్మీద దీంతో పాయకరావుపేట టిడిపిలో పుట్టిన ముసలం ఎటు దారితీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు..