Home News

జగన్ బాటలో చంద్రబాబు యాత్ర …

SHARE

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ బాటలో నడుస్తున్నారు. వైఎస్ మరణించాక.. ఓదార్పు యాత్ర చేపట్టిన ఆయన.. తన తండ్రి అభిమానుల కుటుంబాలను పలకరించారు. ఉమ్మడి రాష్ట్రమంతటా తిరుగుతూ.. నిత్యం జనాల్లోనే ఉన్నారు. దీంతో మాకు అండగా జగన్ ఉన్నాడనే భావన జనాల్లో ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు చేపట్టే పరామర్శ యాత్ర కూడా టీడీపీకి ఆ రకంగానే ఉపయోగపడే అవకాశం ఉంది.

ఓవైపు కార్యకర్తలపై దాడులు జరుగుతుండటం, మరోవైపు పార్టీ నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో బాబు పరామర్శ యాత్ర చేయాలన్న నిర్ణయం డబుల్ స్ట్రాటజీగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు భరోసాను ఇవ్వడంతోపాటు.. పార్టీని కాపాడుకోవడానికి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి కూడా పరామర్శ యాత్ర ఉపకరిస్తుంది. మీడియాలో హైలెట్ కావడం ద్వారా ఆటోమెటిగ్గా.. ప్రజానీకంలో సానుభూతి వస్తుంది. అధికార పార్టీ కార్యకర్తలను నియంత్రించడానికి కూడా ఈ పరామర్శ యాత్ర చంద్రబాబుకు ఉపయోగపడే అవకాశం ఉంది.

37 ఏళ్లపాటు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదంటున్న చంద్రబాబు తమ పార్టీకి 65 లక్షల మంది కార్యకర్తలున్నారని.. కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పార్టీకి ఓ సైన్యాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక 40 రోజుల్లోనే మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్న వారికే నష్టం వాటిల్లుతుందన్నారు చంద్రబాబు..

టీడీపీ మనుగడకే ముప్పు పొంచి ఉన్న వేళ చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నారు. కార్యకర్తలకు అండగా ఉండటం కోసం జిల్లాల వారీగా కొత్తగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కుప్పం పర్యటన తర్వాత బాబు పరామర్శ యాత్ర ప్రారంభం కానుంది.