Home News

చంద్రబాబు సెక్యూరిటీ అధికారులకు తప్పని కష్టాలు…!

SHARE

వారంతా గతంలో ఏపి సిఎం దగ్గర పని చేశారు… తమ విధుల్లో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చీఫ్‌ సెక్యూరిటీ అధికారులుగా విధులు నిర్వహించారు… అదే వారి కష్టాలకు కారణమైనట్లు కనిపిస్తోంది … చంద్రబాబు వద్ద నుంచి రిలీవ్ చేసిన ఆ అధికారులకు పోస్టింగ్ లు మాత్రం దక్కడం లేదు… పోస్టింగ్ సంగతి పక్కన పెడితే తమపై టిడిపి ముద్ర వేసి చూస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ఈ పరిణామాలతో ప్రస్తుతం బాబు వద్ద పనిచెయ్యడానికి ఇతర అధికారులు ఇష్టపడటం లేదనే చర్చ నడుస్తోంది సెక్యూరిటీ వింగ్ లో…!

ఏపి మాజీ సిఎం చంద్రబాబు భద్రతను ప్రభుత్వం కుదించింది … ఎన్నికల్లో ఓటమి తరవాత ప్రతిపక్ష నేతకు ఉండే హోదా మేరకు భద్రతను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెపుతోంది. అప్పట్లో చంద్రబాబుకు సీఎస్‌ఓలుగా ఉన్నతాధికారులు ఉండే వారు… ఇద్దరు సీఎస్‌ఓలలో ఒకరు ఏఎస్పి క్యాడర్ అధికారి కాగా… మరొకరు నాన్ క్యాడర్ ఎస్పీ స్థాయి అధికారి. 014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు సీఎస్‌ఓలుగా ఉన్నవారి స్థానంలో ఇద్దరు కొత్త అధికారులను నియమించారు … శాఖలో మెరుగైన రికార్డ్ ఉన్న భద్రయ్య, సుబ్బారాయుడులను ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ అధికారులుగా నియమించారు… తాజాగా కొత్త ప్రభుత్వం చేసిన మార్పులలో భాగంగా వారితో పాటు వారి కింద పనిచేసిన ఇతర భద్రతా సిబ్బందిని కూడా డిపార్ట్‌మెంట్‌కు హ్యాండ్‌ఓవర్‌ చేశారు …

సాధారణంగా ప్రతిపక్ష నేతలకు ఈ స్థాయి అధికారులను సీఎస్‌ఓలుగా నియమించరు… ఆయా ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం కూడా ఈ నియామాకాలు ఉంటాయి… ఆ క్రమంలో చంద్రబాబు భద్రతను కుదించిన ప్రభుత్వం ఇద్దరు సీఎస్‌ఓలను హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయమని చెప్పింది. వీరితో పాటు వీరి కింద ఉండే ఇతర అధికారులను కూడా వెనక్కి పిలిపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా… వెనక్కి పిలిచిన ఆ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో వారు పాపం తెగ టెన్షన్‌ పడుతున్నారంట…అయితే ఈ సారి మాత్రం ఆ ఇద్దరు మాజీ సీఎస్‌ఓలను టిడిపి మనుషులుగా చూస్తున్నారట… విధుల్లో భాగంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు చంద్రబాబు వద్ద పని చేశామని… ఆ మాత్రానికి తమపై పార్టీ ముద్ర వెయ్యడం సరి కాదు అంటున్నారు….

విధుల్లో నిర్లక్ష్యం ఉంటేనో…. మరేదో ఆరోపణలు ఉంటేనో పక్కన పెడితే అర్థం ఉంది గాని…. గత సీఎం దగ్గర చేశామని తమను చిన్న చూపు చూడడం బాధిస్తోందని సదరు అధికారులు ఫీల్‌ అవుతున్నారంట.హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేసిన అధికారులకు మళ్లీ పోస్టింగ్ వచ్చే వరకు జీతం ఇవ్వరు… పోస్టింగ్‌ లేకుండా ఎంతకాలం ఖాళీగా ఉంటారో అంత కాలానికి రావాల్సిన జీతానికి సంబంధించి .. తిరిగి పోస్టింగ్‌ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. అప్పుడు డిపార్ట్‌మెంట్‌ రీఎంబర్స్‌మెంట్‌ చేస్తుంది… అలాగే వాహనం, ఇతర సదుపాయాలు కూడా ఉండవు… అంటే వారు పనిష్మెంట్ లో వచ్చిన అధికారుల్లాగానే ట్రీట్ చెయ్యబడతారన్న మాట..

చంద్రబాబుతో వందల పర్యటనలు, మీటింగ్ లలో చిన్న ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించిన తమకు దక్కిన ఫలితం ఇదేనా అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు… ప్రస్తుతానికి పోస్టింగ్ లేకపోయినా… తరువాత బదిలీల్లో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారు. మరి వారికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.