Home News Politics

గ్రేటర్ గులాబీలో చల్లారని అసమ్మతి….

SHARE

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికార పార్టీలో ఇంకా అసమ్మతి సెగలు తగ్గలేదు… సీటు కోసం ఆశ పడి భంగపడ్డ నేతలు టిఆర్‌ఎస్‌ క్యాండెట్లకు నిద్రలేకుండా చేస్తున్నారు.. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పోటీగా ప్రచారం కూడా మొదలు పెట్టారు… మరోవైపు అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తూ అసమ్మతి సభలతో గులాబీపార్టీలో వేడి పుట్టిస్తున్నారు.

ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 14 నియోజక వర్గాల్లో 11 నియోజకవర్గాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు… అభ్యర్ధులను ప్రకటించీ ప్రకటించగానే అధికార పార్టీ లో అసమ్మతి మొదలయింది… గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ టికెట్ పై పోటీ చేసి పరాజయంపాలైన వారికి టికెట్ ఇవ్వకుండా .. పార్టీ మారి గులాబీ తీర్థం పుచ్చుకున్న తాజా మాజీ ఎమ్మెల్యేలను అభ్యర్ధులుగా ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లో ఆందోళన మొదలైంది…

చేవెళ్ల నియోజక వర్గం సీటు ను కాంగ్రెస్ నుండి వచ్చిన యాదయ్యకి కేటాయించడం తో అక్కడి నుండి గతం లో పోటీ చేసిన కె ఎస్ రత్నం కాంగ్రెస్ కి జంప్ అయ్యారు … మహేశ్వరం నియోజకవర్గంలో తీగల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వడంతో 2014 లో టిఆర్‌ఎస్‌ టికెట్ పై పోటీ చేసిన మనోహర్ రెడ్డి రెబల్ గా బరిలో నిలవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు … ఇబ్రహీంపట్నంలో అధికారపక్ష అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి వ్యతిరేకంగా .. సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల శేఖర్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తూ … తాను ఏదో ఒక పార్టీ నుంచి పోటీలో ఉంటానని ప్రచారం చేసుకుంటున్నారు …

ఇక ఉప్పల్ లో భేతి శుభాష్ రెడ్డి కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి… పార్టీ లోని కొందరు శుభాష్‌రెడ్డి కి కాకుండా ఎవరికిచ్చినా గెలిపించుకుంటాం అంటూనే .. మేయర్ బొంతు రామ్మోహన్ కి ఉప్పల్‌ టికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరమీదకు తెస్తున్నారు … కుత్బుల్లాపూర్ లో టిఆర్‌ఎస్‌ నుంచి గతంలో పోటీ చేసిన కొలను హన్మంతరెడ్డి ఈ సారి టికెట్‌ దక్కకపోవడంతో తాను పోటీ లో ఉండడం ఖాయం అంటున్నారు…

కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణరావు కి టికెట్ ఇవ్వడంతో టిఆర్‌ఎస్‌ నేత హరీష్‌రెడ్డి పార్టీ కి రాజీనామా చేసి అసమ్మతి సభ కూడా పెట్టారు .. ఆ క్రమంలో ఆయన కూడా పోటీ చేయడానికి సిద్దమయ్యారు … శేరిలింగంపల్లిలోను కార్పొరేటర్ల కినుకతో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి … మొత్తమ్మీద ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి వాదులను కన్విన్స్ చేయక పోతే పలు నియోజక వర్గాల్లో అభ్యర్థుల గెలుపు పై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది…..