Home News Updates

కృష్ణా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇసుక గలాట…!

SHARE

వారిద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఇద్దరూ చానాళ్ళుగా సఖ్యతగానే ఉన్నారు. కానీ ఒక ఎమ్మెల్యే గారి తమ్ముడి వల్ల మరో ఎమ్మెల్యే గారికి కోపమొచ్చింది. చెప్పి చూసినా వినకపోవటంతో ఇక వార్నింగ్ ఇచ్చారు. ఇదే తప్పు రిపీట్ అయితే బాగోదని ఘాటుగానే స్పందించారు. వారెవరో కాదు కృష్ణాజిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ లు. ఇప్పుడు వీరి వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ గోడవకు ఇసుక ర్యాంపు వ్యవహారమే కారణంగా మారింది.

కృష్ణాజిల్లాలో ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇవ్వటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలే. ఇంత వరకు వ్యవహారం రావటానికి ప్రధాన కారణం ఇసుక ర్యాంపు నుంచి ఇసుక అనధికార రవాణా. కృష్ణాజిల్లాలో మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలవగా, పెడన నుంచి జోగి రమేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో జోగి రమేష్ మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మైలవరం నియోజక వర్గ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నంలోనే జోగి రమేష్ కుటుంబ సభ్యుల నివాసం. ఈ ఎన్నికల్లో వసంత గెలుపుకు జోగి కుటుంబం కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. దీనితో ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఇద్దరూ కూడా కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్న సమయంలో ఇద్దరి మధ్య జోగి రమేష్ సోదరుడు గ్యాప్ రావటానికి కారణమయ్యాడనేది ఇప్పుడు కృష్ణా జిల్లాలో నడుస్తున్న టాక్…

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ సమయంలో ఉన్న ఇసుక పాలసీని రద్దు చేసింది. కొత్త పాలసీ ప్రకటించే వరకు ఇసుక ర్యాంపుల్లో ఇసుక తరలింపుపై నిషేదం పెట్టింది. కేవలం ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుకను తీసుకువెళ్లాలని, కొత్త నిర్ణయం ప్రకటించిన తర్వాతే ర్యాంపుల నుంచి ఇసుకను బయటకు పంపాలనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే జూపూడిలో ఉన్న ఇసుక ర్యాంపులో అర్ధరాత్రి అనధికారికంగా ఇసుక తోడుకుని పెద్ద ఎత్తున లారీలు వెళుతున్నాయి. వీటికి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సోదరుడు సహకరిస్తున్నాడనేది ప్రధాన ఆరోపణ.స్థానికంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయినప్పటికీ ఆయనకు తెలియకుండా వ్యవహారం అధికారులతో కలిసి నడిపించటం పెద్ద దుమారమే రేపింది.

తన నియోజక వర్గంలో అనధికారికంగా జరుగుతున్న ఇసుక రవాణాపై వసంత వరకు వ్యవహారం వెళ్ళింది. దీనితో ఆయన వెంటనే ఎమ్మెల్యే జోగి రమేష్ తో మాట్లాడి జరిగిన విషయం చెప్పారట. తనకు తెలియదని చెప్పిన జోగి ఇకపై ఇలా జరగకుండా మాట్లడతా అని వసంతకు చెప్పారని సమాచారం. వసంత మాత్రం ఇలాంటి వ్యవహారాలు తనకు మచ్చ తెస్తాయని, సోదరుడికి గట్టిగా చెప్పాలని వినకుండా కొనసాగిస్తే బాగోదని దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారట. జోగి రమేష్ కు చెప్పటంతో ఆగకుండా పార్టీలో పెద్దలకు, సీఎంఓ కి సైతం జూపూడిలో ఇసుక వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని నేరుగా ఎమ్మెల్యేనే ఫోన్ చేసి చెప్పటం గమనార్హం. అధికార పార్టీ ఎమ్మెల్యే అది కూడా ఆయన నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై చెప్పటంతో ఖంగుతిన్న కలెక్టర్ సబ్ కలెక్టర్, ఇతర సిబ్బందిని పంపి అక్కడ ర్యాంపు నుంచి బయటకు లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.

జిల్లాలో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు జగన్ అవినీతి వద్దు పారదర్శకంగా ఉండే పాలన చేయాలని చెబుతున్న నేపధ్యంలో ఒక ఎమ్మెల్యే సోదరుడు అనధికార వ్యవహారానికి వత్తాసు పలకటం, మరో ఎమ్మెల్యే దాన్ని అడ్డుకోవటంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యవహారం సీఎంఓతోపాటు పార్టీ వరకు వెళ్లటంతో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటానికి చర్యలు చేపట్టే పనిలో ఉన్నారట పార్టీ నేతలు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముందుకు వెళ్లాలని, అనధికార అవినీతి వ్యవహారాలకు అందరూ దూరంగా మసులుకోవాలని జగన్ పదే పదే చెబుతున్న నేపధ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధంగా జగన్ వ్యవహరిస్తారో చూడాలి మరి.