Home News Stories

కృష్ణాలో పెరిగిన పొలిటికల్ హీట్…!

ఎన్నికల కురుక్షేత్రానికి తెరలేచింది … ప్రచారపర్వం పీక్‌ స్టేజ్‌కి చేరుతోంది .. ఎవరి లెక్కలతో వారు ప్రత్యర్ధుల ఓటమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు.. తమ విజయం కంటే ప్రత్యర్ధిని ఓడించడమే లక్ష్యంగా కొందరు ఎన్నికల బరిలో దూసుకెళ్తున్నారు.. ముఖ్యంగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, మైలవరం, బెజవాడ సెంట్రల్, బెజవాడ వెస్ట్‌, బెజవాడ ఎంపీ సెగ్మెంట్‌, గుడివాడ నియోజక వర్గాల్లో పంతం పట్టిన నేతలు సత్తా చాటుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు… విజయమే లక్ష్యంగా కొందరు , ప్రత్యర్ధి ఓటమే లక్ష్యంగా మరికొందరు పావులు కదుపుతుండటంతో జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది…

కృష్ణాజిల్లాలో పంతం పట్టి ఎన్నికల బరిలోకి దిగిన నేతలు చేస్తున్న రాజకీయం ఉత్కంఠ రేపుతోంది… సదరు లీడర్లు ఆర్ధిక, అంగబలంతోపాటు వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల్లో పైచేయి సాధించటానికి అన్ని రకాలుగా శ్రమిస్తున్నారు… తమ గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్నా.. ప్రత్యర్ధి పరాజయమే ముఖ్యమన్నట్లు పావులు కదుపుతున్నారు .. జిల్లాలో ప్రధానంగా జగ్గయ్యపేట నియోజక వర్గం తీసుకుంటే రెండు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని ఉదయభాను గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు… మూడో సారి హ్యాట్రిక్ కొట్టడానికి టీడీపీ నుంచి శ్రీరాం తాతయ్య తహతహలాడుతుంటే ఉదయభాను మాత్రం శ్రీరాం తాతయ్య విజయయాత్రకు బ్రేక్ వేస్తానని శపథం చేశారు… గత ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఉదయభాను ఈసారి మాత్రం తన లెక్క తప్పదంటున్నారు. శ్రీరాం తాతయ్య కూడా భానుకు మూడోసారి ఝలక్ ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు..

మంత్రి దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది… ఇక్కడ నుంచి రెండు సార్లు గెలిచి మంత్రిగా ఉన్న దేవినేని ఉమానే ఓడించటమే తన జీవిత ధ్యేయమని వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తొడ కొడుతున్నారు… నియోజకవర్గంలో ఆరు నెలల క్రితం నుంచి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న వసంత ఏ చిన్న అవకాశం దొరికినా మంత్రి ఉమాను వదలకుండా ఇబ్బందిపెడుతున్నారు… మంత్రి ఉమా వ్యూహాలకు బ్రేక్ చేసేలా ప్రతివ్యూహాలను వసంత సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు… దాంతో మైలవరంలో ప్రతి క్షణం టెన్షన్ వాతావరణం నెలకొంటోంది … శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది..

వైసిపిలో బెజవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదని అలిగిన వంగవీటి రాధా ఇప్పుడు అక్కడ ఆ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణుని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు… మూడు ఎన్నికల్లో పోటీ చేసిన వంగవీటి రాధా ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు… కేవలం వైసీపీ ఓటమే ధ్యేయంగా ఆయన టీడీపీలో స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తున్నారు… రాధాకు వైసిపిలో అన్యాయం జరిగిందన్న ఆగ్రహంతో వంగవీటి వర్గీయులు సెంట్రల్‌ సెగ్మెంట్లో టిడిపి అభ్యర్ధి బోండా ఉమకు మద్దతుగా ప్రచారం చేస్తుండటం పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది … మరోవైపు రాధా వ్యూహాలకు విష్ణు కూడా ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు…

ఇక విజయవాడ పశ్చిమలో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ ఓటమే ధ్యేయంగా స్వతంత్ర్య అభ్యర్ధి కోరాడ విజయ్‌కుమార్‌ పనిచేస్తుండటం హట్‌టాపిక్‌గా మారింది … వరుస ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందిన కోరాడ విజయ్‌ స్థానికంగా పట్టున్న నాయకుడే .. గత ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసిన వెలంపల్లి 3107ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు… అప్పట్లో కూడా రెబల్ వల్లే వెలంపల్లి ఓటమి పాలయ్యారు… ఈసారి కోరాడ కూడా ఓట్లు చీల్చటం ద్వారా వెలంపల్లిని ఓడించాలని చూస్తున్నారు .. ఒకప్పటి స్నేహితులైన వెలంపల్లి, కోరాడ మధ్య వ్యక్తిగత విబేధాల కారణంగా ఈ పరిస్థితి వచ్చిందనేది బెజవాడ వాసులకు తెలిసిందే.

ఇక గుడివాడలో కూడా కొడాలి నానిని ఓడించటం ద్వారా తన పొలిటికల్‌ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకోవాలని దేవినేని అవినాష్ ఉవ్విల్లూరుతున్నారు… గుడివాడలో పట్టు కోల్పోయిన టీడీపీకి తిరిగి పునర్వైభవం తీసుకొస్తానని దేవినేని నెహ్రూ వారసుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు .. బెజవాడ నుంచి అవినాష్ తండ్రి నెహ్రూ అనుచర వర్గమంతా అక్కడే ఉండి అవినాష్ గెలుపు కోసం పనిచేస్తుండటంతో గుడివాడ రాజకీయం వేడెక్కిపోతోంది … మరి వీరిలో ఎవరు తమ పంతాలు నెగ్గించుకుంటారో చూడాలి..

ఇక 2014 ఎన్నికల సమయంలోనే మాటల యుద్ధానికి దిగిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, పీవీపీలు ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలబరిలో తలపడుతున్నారు … 2014లో పోటీ చేసే అవకాశం దక్కకపోయిన పీవీపీ ఈ సారి కేశినేనిపై విజయమే లక్ష్యంగా గ్రౌండ్‌వర్క్‌ చేస్తున్నారు … ఆర్థిక నేరగాడు, అంతర్జాతీయ నేరగాడు అని విమర్శలు గుప్పిస్తున్న కేశినేని నానిపై గెలుపొంది పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు పీవిపీ….