Home News

ఏపీలో ఆ జిల్లానే టార్గెట్ చేసిన బీజేపీ…!

SHARE

కమలనాథుల ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుందా? … గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బిజెపిలోకి జంప్‌ అవుతారా?… స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఆ జిల్లాలో కార్యాచరణ మొదలు పెట్టిందా? .. అసలు ఆ జిల్లా టీడీపీలో ఏం జరగబోతోంది? .. ఈ తతంగం వెనుక చక్రం తిప్పుతున్న బడా నేత ఎవరు?

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఘోర పరాజయం పాలైంది .. పార్టీ చరిత్రలో ఎరగని ఓటమి మూటగట్టుకుంది .. అయితే ప్రకాశం జిల్లాలో మాత్రం మొత్తం 12 అసెంబ్లీ స్థానాలలో నాలుగు స్థానాలలో విజయం సాధించి పరువు నిలబెట్టుకుంది… ఇప్పటికే నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి చేరడంతో వారి వెనకాలే ప్రకాశం జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది జంపయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది… దీంతో జిల్లాలో తెలుగుతమ్ముళ్ళు గందరగోళానికి గురవుతున్నారు …

జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ ఇటీవలే బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు… కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరికి జిల్లాలోని టిడిపి నేతలతో మంచి సంబంధాలున్నాయి… ఆయన నేతృత్వంలోనే జిల్లా ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరబోతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది .. బిజేపీ కూడా రాష్ట్రంలో బలపడేందుకు కసరత్తులు చేస్తుంది … అందులో భాగంగానే జిల్లాలో టిడిపి తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు బిజెపి పెద్దలు కాషాయ దళంలో చేరాలంటూ ఇన్విటేషన్లు పంపించారట… కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఈ వ్యవహారం మొత్తం నడుస్తోందట… బిజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరికి సైతం జిల్లాలోని నాయకులతో మంచి సంబంధాలున్నాయి… ఆమె వైపు నుంచి టిడిపిలోని ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులకు గాలం వేయాలన్న ప్రణాళికతో కమలం నాయకులు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గడిచిన ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి ఓటమి పాలైన వారిని… అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నించి దక్కించుకోలేక పోయినవారిని సైతం … తమ వైపునకు లాక్కునే పనిలో బిజెపి నాయకులు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది … స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో … ఇప్పటికే జిల్లాలో జడ్పీటిసి, ఎంపిటిసి, ఎంపీపీ, సర్పంచ్ లుగా పనిచేసిన నేతలకు బిజెపి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది … గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను…వారితో పాటు ఓటమి పాలైన వారిని, టిక్కెట్లు దక్కని వారిని, ద్వితీయ శ్రేణి నాయకులను బీజేపీలోకి రమ్మంటూ ఆ పార్టీలో ఇటీవల చేరిన మాజీ టీడీపీ నేతలు ఫోన్లు మీద ఫోన్లు కొడుతున్నారట.

స్టేట్ లో టీడీపీ పరిస్థితి చూస్తే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని చెప్తూ నేతలపై వత్తిడి పెంచుతున్నారంట … ఆ క్రమంలో కేంద్రంలో పవర్ ఉన్న బీజేపీ నుండి వస్తున్న ఆఫర్లతో జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందనే ప్రచారం మొదలైంది … మరి ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.