Home News Politics

అన్ని పదవులు అనంతకేనా….కంచుకోటలో టీడీపీ స్కెచ్ ఏంటి…?

SHARE

అన్ని పదవులు ఆ జిల్లాకే దక్కుతున్నాయి. దాదాపు సగం నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు చీఫ్‌విప్‌లు, ఇద్దరు విప్‌‌లు, ఇద్దరు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, ఒక టీటీడీ బోర్డు సభ్యుడు, ఒక పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు వీరే కాకుండా మరికొందరు కార్పొరేషన్ డైరెక్టర్లు సీమ జిల్లాల్లో కంచుకోట అయిన అనంతపురంలో పదవుల పండగ చేస్తున్న సైకిల్ పార్టీ స్కెచ్ ఏంటీ…

అధికార పదవుల్లో అనంతపురం జిల్లాకు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. 2019 ఎన్నికలే టార్గెట్ గా జిల్లాకు పదవుల పంపకాల్లో పెద్దపీట వేస్తున్నారు. తాజాగా కదిరి ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాను విప్‌గా నియమించి సీఎం చంద్రబాబు జిల్లాకి మరో పదవి కట్టబెట్టారు. రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను అన్నివిధాలుగా ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావడానికి వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగా అనంత పై ప్రత్యేక దృష్టి సారించింది టీడీపీ అధిష్టానం.

జిల్లాలోని దాదాపు సగం నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంత్రులుగా కొనసాగుతున్నారు. ఉరవకొండకు చెందిన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు శాసనమండలి చీఫ్‌విప్‌గా, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి శాసనసభ చీఫ్‌విప్‌గా అవకాశం కల్పించారు. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లలో కొందరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు కేటాయించారు.చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరిమి ప్రకాష్ నాయుడు,పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, హిందూపురానికి చెందిన రంగనాయకులుకు రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. ఇక పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు.

హిందూపురం, కదిరి, ఉరవకొండ, పుట్టపర్తి, పెనుకొండ, శింగనమల నియోజకర్గాల్లో కూడా ప్రొటోకాల్‌ పదవులున్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, కళ్యాణదుర్గం, మడకశిర నియోజకవర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాకుండా ఎటువంటి ఇతర పదవులూ లేకపోవడం విశేషం. దీంతో ఆ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు పదవుల విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

2014 ఎన్నికల్లో ఉరవకొండ, కదిరి మినహా మిగతా చోట్ల టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అదే సమయంలో జిల్లాలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన మడకశిర, శింగనమలకు అదనంగా ఎమ్మెల్సీ పదవులు కూడా కేటాయించారు. ఈ విషయంలో మడకశిరలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామికి అవకాశం కల్పించి ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పట్టు సడలకుండా ఉండాలనే ఎత్తుగడ వేశారు. శింగనమల నియోజకవర్గంలో యామినీబాల ఎమ్మెల్యేగా ఉండగా.. యామినీబాల తల్లి శమంతకమణికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఇక జిల్లాలో తాజాగా చాంద్‌బాషాకు విప్‌ పదవి ఇచ్చారు. దీంతో రాయదుర్గం, రాప్తాడు నియోజకవర్గాలకు మంత్రి పదవులుండగా, అనంతపురం నియోజకవర్గంలో రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రొటోకాల్‌ పదవులున్నాయి.

ఎన్నికలే లక్ష్యంగా అనంతలో టీడీపీ పదవుల పందారం చేసిందని ఇక జిల్లా పై పట్టుసడలకుండా చూడాల్సింది నాయకులే అంటున్నారు పార్టీ గ్రౌండ్ లెవల్ క్యాడర్.